శాసనమండలి ఎన్నికల పుణ్యమాని టీడీపీ-సీపీఐ మధ్య పొత్తు ఖాయమైనట్లుంది. నిజానికి తెలుగుదేశంపార్టీకి సీపీఐ తోకపార్టీలాగ తయారైందని ఎప్పటినుండో మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తునే ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా ఎలాంటి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో మరుసటి రోజు అవే ఆరోపణలు, విమర్శలను సీపీఐ కార్యదర్శి రామకృష్ణ చేస్తున్నారు. చాలాసందర్భాల్లో చంద్రబాబుతో కలిసే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ విషయంలో సొంతపార్టీ నుండి ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా రామకృష్ణ లెక్కచేయటంలేదు.
టీడీపీతో రామకృష్ణ ఇంతగా కలిసిపోయినా అధికారికంగా పొత్తు అయితే లేదు. ఇలాంటి నేపధ్యంలోనే ఎంఎల్సీ ఎన్నికల్లో అధికారికంగా రెండుపార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. వీటికి పీడీఎఫ్ కూడా తోడయ్యింది. ఐదు నియోజకవర్గాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను ఓడించటమే లక్ష్యంగా తాము ముగ్గరం కలిసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరి పార్టీల అభ్యర్ధులకు వాళ్ళు వేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
ఇక రెండో ప్రాధాన్యత ఓట్లను మాత్రం ఒక పార్టీ ఓట్లు మరొకపార్టీకి పడాలన్నది వీళ్ళ వ్యూహం. పై స్ధాయిలో ఓట్లకోసం నేతలు పొత్తులపేరుతో ఒప్పందాలు చేసుకున్నారు బాగానే ఉంది. వీళ్ళ ఒప్పందాలు కిందస్ధాయి ఓటర్లవరకు వెళ్ళాలి కదా. వీళ్ళు పొత్తుపెట్టుకోవటమే కాకుండా జనసేనను కూడా తమకు మద్దతుగా చేర్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి అధికారికంగా బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన వీళ్ళతో కలుస్తుందా ?
ప్రతిపక్షాల మధ్య జరిగిన ఓట్ల ఒప్పందాన్ని అధికారపార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది. వీళ్ళ వ్యూహాలకు విరుగుడుగా వైసీపీ ఎలాంటి వ్యూహం పన్నుతుందో చూడాల్సిందే. ఇపుడుగనుక టీడీపీ, సీపీఐ వ్యూహం సక్సెస్ అయితే ముందుముందు ఈ పార్టీలు మరింత ఉత్సాహంతో రెచ్చిపోవటం ఖాయం. నిజానికి ఐదుస్ధానాల్లో ఏ ఒక్కదాంట్లో ప్రతిపక్షాలు గెలిచినా వైసీపీకి ఇబ్బంది తప్పదు. ఆ పరిస్ధితి రాకూడదనే జగన్మోహన్ రెడ్డి అన్నీ స్ధానాలను గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. మరి చివరకు ఎవరి వ్యూహాలు ఫలిస్తాయన్నది ఆసక్తిగా మారుతోంది.