రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయాన్ని టాప్ సీక్రెట్ గా ఉంచారు. ఒక పార్టీ అధినేతయ్యుండి ఏ నియోజకవర్గంలో పోటీచేస్తారో కూడా తేల్చుకోలేకపోవటం విచిత్రమనే చెప్పాలి. బహుశా దేశం మొత్తంమీద ఇలాంటి పరిస్ధితి ఒక్క పవన్ విషయంలోనే జరుగుతోందేమో. అయినా పోటీచేయబోయే నియోజకవర్గాన్ని పవన్ ఎందుకింత రహస్యంగా ఉంచుతున్నారు. ఈ పాటికే ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే ఉంటారనటంలో సందేహంలేదు. కాకపోతే బయటకు చెప్పటంలేదంతే.
పవన్ పోటీచేయబోయే నియోజకవర్గాలని ఇప్పటికి చాలా పేర్లే ప్రచారంలో ఉన్నాయి. భీమిలీ, విశాఖపట్నం ఉత్తరం, కాకినాడ రూరల్, తిరుపతి, పిఠాపురమని ఇలా చాలా నియోజకవర్గల పేర్లే చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ నియోజకవర్గం పేరును పవన్ ఎందుకంత సీక్రెట్ గా ఉంచినట్లు ? ఎందుకంటే తాను పోటీచేయబోయే నియోజకవర్గం పేరును ఇప్పుడే ప్రకటించేస్తే వైసీపీ అలర్టవుతుందని పవన్ భయపడుతున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
పవన్ పోటీచేయబోయే నియోజకవర్గం ఇదే అని ప్రకటిస్తే అక్కడ గట్టి అభ్యర్ధి లేకపోతే పక్కనుండైనా తెచ్చి ఇక్కడ పోటీకి వైసీపీ రెడీ చేసుకుంటుందేమో అనే అనుమానాలు సోషల్ మీడియాలో బాగా పెరిగిపోతోంది. ఇపుడు భీమిలీలో అవంతి శ్రీనివాస్, కాకినాడ రూరల్లో కన్నబాబు, తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి, పిఠాపురంలో పెండెం దొరబాబు ఎంఎల్ఏగా ఉన్నారు. విశాఖపట్నం ఉత్తరంలో ఇన్చార్జున్నారు.. అయితే వివిధ కారణాలతో దొరబాబు మాత్రమే వీక్ గా కనిపిస్తున్నారు.
ఇందుకనే కాకినాడ ఎంపీ వంగా గీత రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీచేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి ప్రచారంలో ఉన్న నియోజకవర్గాలు కాకపోతే ఏ నియోజకవర్గంలో పోటీచేసినా పవన్ గట్టిపోటీ అయితే ఎదుర్కోక తప్పదు. చివరి నిముషంలో నియోజకవర్గాన్ని ప్రకటించి హడావుడి పడేబదులు ముందే నియోజకవర్గాన్ని ప్రకటించటం వల్ల లాభాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని పవన్ ఆలోచించాలి. నియోజకవర్గాన్ని సీక్రెట్ గా ఉంచేకొద్దీ వచ్చేఎన్నికల్లో కూడా గెలుపుపై నమ్మకం లేదా అని పవన్ పై సెటైర్లు పేలుతున్నాయి. ఎక్కడినుండి పోటీచేస్తారో కానీ భారమంతా చంద్రబాబునాయుడు మీదే పడేట్లుంది.