జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు వెనకబడిపోవటం ఏమిటి ? అసలు పార్టీ ఉందో లేదో కూడా తెలీకుండా ఉన్న టీడీపీ తరపున పోటీచేసిన అభ్యర్ధులు భారీ మెజారిటిలతో దూసుకుపోవటం ఏమిటి ? టీడీపీ, పీడీఎఫ్ కన్నా బాగా ముందుగానే జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధులను ప్రకటించారు.
అభ్యర్ధులు కూడా తమ శక్తిమేరకు ప్రచారం చేసుకున్నారు. రంగంలోకి దిగిన అభ్యర్ధులు ఆర్ధికంగా బాగా గట్టి వాళ్ళనే చెప్పాలి. అయినా ఓటమిబాటన ఎందుకు నిలవాల్సొచ్చింది. ఎందుకంటే పార్టీ సోషల్ మీడియాలోనే దీనికి సమాధానాలు దొరుకుతున్నాయి. తాజా ఫలితాలు చూసిన తర్వాత పార్టీ అభిమానులే సోషల్ మీడియా వేదికగా పార్టీ, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది నుండి పార్టీ కార్యకర్తల బాధలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.
అవేమిటంటే పార్టీ గెలుపుకోసం పనిచేసిన తమను ఎంఎల్ఏలు, మంత్రులు, ఎంపీలు ఏమాత్రం లెక్కచేయటంలేదని. చివరి నిముషంలో రేసులోకి దూసుకుని వచ్చి టికెట్లు తీసుకుని కార్యకర్తల కష్టం+జగన్ గాలితో గెలిచిన వాళ్ళు తమను అసలు దగ్గరకు కూడా రానీయటం లేదని మండిపోతున్నారు. పార్టీలో పెత్తనమంతా బయటపార్టీల నుండి వచ్చిన వారిదే అంటు ఎప్పటికప్పుడు గోలచేస్తునే ఉన్నారు. కష్టకాలంలో ఉన్నపుడు పార్టీ జెండా మోసిన వాళ్ళని, బ్యానర్లు కట్టిన తమకు పార్టీలోనే అవమానాలు ఎదురవుతున్నట్లు గోడు వెళ్ళబోసుకుంటూనే ఉన్నారు.
తమ కష్టాలు, సమస్యలు జగన్ దృష్టికి వెళ్ళటంలేదని చాలామంది ఫీలవుతున్నారు. ఇలాంటి బాధలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోవటంతో చివరకు పార్టీకి ఏదో సందర్భంలో గుణపాఠం చెబితే కానీ అసలు నేతలు కళ్ళు తెరవరని సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిగి తీర్మానాలు కూడా అయిపోయాయి. బహుశా ఇలాంటి సమయం కోసమే అందరు ఎదురుచూసినట్లున్నారు. అయితే వీళ్ళెవరికీ పార్టీ అధికారంలో నుండి దిగిపోవాలని లేదు. కేవలం గట్టి గుణపాఠం తగిలితే జగన్ వాస్తవాలు తెలుసుకుంటారని మాత్రమే వీళ్ళనుకుంటున్నారు. అందుకనేమో జగన్ కు గుర్తుండిపోయేట్లుగా గుణపాఠం చెప్పారు. చూద్దాం దీంతో అయినా జగన్ కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకుంటారేమో.