ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నది చాలా ఓల్డ్ సామెత. ఇపుడంతా ఒకే దెబ్బకు వీలుంటే రెండు, మూడు లేకపోతే అంతకన్నా ఎక్కువ పిట్టల్నే కొట్టాలన్నది ట్రెండ్. ఇపుడిందంతా ఎందుకంటే అప్పుడెప్పుడో టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన విషయం గుర్తుందా. దాన్ని ఇపుడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించబోతున్నారనే వార్త గుప్పుమంది. వైజాగ్ స్పీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా గంటా దాదాపు ఏడాది క్రిందట రాజీనామా చేస్తే దాన్ని ఇపుడు ఆమోదించటం ఏమిటి ?





ఇక్కడే ఒక దెబ్బ మూడు పిట్టలు అనే సామెత మొదలైంది. దెబ్బేమో గంటా రాజీనామా ఆమోదించటం. మూడు పిట్టల్లో  మొదటిదేమో ఎంఎల్ఏ కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎంఎల్సీ ఎన్నికలో టీడీపీకి దెబ్బ ఖాయం. అసలే అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవసరమైన ఓట్లు లేక నానా అవస్తలు పడుతున్న టీడీపీకి ఇది పెద్ద షాకనే చెప్పాలి. ఇక రెండో పిట్టేమో  విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి బైపోల్ జరిగే అవకాశం ఉండటం. మూడు పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో గెలిచేసి టీడీపీ ఓవర్ యాక్షన్ చేస్తోందని మంత్రులంటున్నారు.





ఇలాంటి సమయంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగితే అప్పుడు అన్నీవర్గాల ఓటర్లు ఓట్లేస్తారు. అప్పుడు నిజమైన గెలుపు ఎవరిదనే విషయాన్ని జనాలే చెప్పినట్లవుతుంది. అందుకనే విశాఖ ఉత్తరంలో ఉపఎన్నిక రావాలని వైసీపీ కోరుకుంటోందట.





ఇక మూడోపిట్ట ఏమిటంటే ప్రతిపక్షాలు దేనికదే అభ్యర్ధిని పెట్టక తప్పని పరిస్ధితి. అంటే టీడీపీ, మిత్రపక్షాల్లో బీజేపీ లేదా జనసేన నుండి పోటీ పెట్టక తప్పుదు. పోటీనుండి కానీ లేదా మద్దతు విషయంలో కానీ జనసేన తప్పించుకునే అవకాశం లేదు. ఇక వామపక్షాలు, కాంగ్రెస్ ఎలాగూ పోటీచేస్తాయి. సో, విశాఖ ఉత్తరంలో ఉపఎన్నిక గనుక వస్తే ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందని వైసీపీ అనుకుంటోందని సమాచారం. గంటా రాజీనామాను ఆమోదించేస్తే ఎన్ని పిట్టలు ఎగిరిపోతాయో చూడండి. మరి స్పీకర్ ఎప్పుడు యాక్షన్లోకి దిగుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: