అసెంబ్లీలో సభా కార్యక్రమాల నిర్వహణ రోజురోజుకు దిగజారిపోతున్నాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం అవ్వగానే ఇద్దరు సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగిపోయి చివరకు కొట్టుకునేంతగా పరిస్దితులు దిగజారిపోయాయి. వైసీపీ సభ్యుడు టీజేఎస్ సుధాకర్ బాబు-టీడీపీ సభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి కొట్టుకున్నట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా తెలుస్తోంది. సభ్యులను శాంతపరిచేందుకు స్పీకర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం కనబడలేదు. పైగా ఉద్రిక్తతలు పెరిగిపోవటంతో చేసేదిలేక తన కుర్చీలో నుండి లేచి వెళిపోయారు.
అసలు ఏమి జరిగిందంటే జీవో 1 ని రద్దుచేయాలని టీడీపీ, వామపక్షాలు ఆందోళన మొదలుపెట్టాయి. ఇదే విషయమై టీడీపీ ఎంఎల్ఏలు సభలో లేవనెత్తారు. ప్రశ్నోత్తర కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతున్న కారణంగా అందరినీ ప్రశాంతంగా కూర్చోవాలని మంత్రులు, స్పీకర్ కూడా చెప్పారు. అయితే టీడీపీ ఎంఎల్ఏలు స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకుని స్పీకర్ ను చుట్టుముట్టారు. జీవో 1 రద్దుచేయాలని రాసున్న ప్లకార్డులను స్పీకర్ మొహంమీద పెట్టారు. దాంతో వైసీపీ ఎంఎల్ఏలు లేచి టీడీపీ సభ్యులను అడ్డుకున్నారు.
ఈ నేపధ్యంలోనే సుధాకర్ బాబు, డోలా మధ్య మాటమాట పెరిగిపోయింది. వాళ్ళిద్దరు ఏమి తిట్టుకున్నారో తెలీదు కానీ చివరకు కొట్టుకునేదాక పరిస్ధితులు వెళ్ళాయనేది సమాచారం. ఇద్దరిలో ఎవరిది తప్పనేది తెలీటంలేదు. తప్పెవరిది అనేది పక్కనపెట్టేస్తే ఇద్దరు సభ్యులూ తమ హద్దులను దాటారనేది అర్ధమవుతోంది. తర్వాత మళ్ళీ సీటులోకి వచ్చిన స్పీకార్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి సిఫారసు మేరకు 11 మంది టీడీపీ ఎంఎల్ఏలను ఒక్కరోజు సభ నుండి సస్పెండ్ చేశారు.
సభ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంఎల్ఏలు ఇద్దరు ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. పరిస్ధితులు కొట్టుకునేంతవరకు పరిస్దితులు దిగజారటానికి కారకులు మీరంటే మీరేనంటు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఏదేమైనా సభ్యుల ప్రవర్తన మితిమీరిపోవటంతోనే పరిస్దితులు ఇలా దిగజారిపోతున్నాయన్నది వాస్తవం. పార్టీల అధినేతలు కూర్చుని ప్రవర్తనా నియమావళిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే కానీ సభా కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశాలు లేవు.