జనసేన అధినేత పవన్ కల్యాణ్ బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నారు. జనాల్లో జనసేన పార్టీ మీద ఎంతటి అభిమానం ఉంది, ఎంతమంది ఓట్లేస్తారని తెలుసుకునేందుకు వచ్చిన అవకాశాన్ని పవన్ వదులుకున్నారు. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీలోకి అభ్యర్ధులను దింపుంటే బాగుండేది. రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రులకు జరిగిన ఎన్నికల్లో పార్టీ తరపున అసలు పోటీకే ఎవరిని దింపకపోవటం తప్పే.





ఇదే కాదు తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా అభ్యర్ధులను దింపలేదు. దీనివల్ల ఏమైందంటే జనసేనకు క్షేత్రస్ధాయిలో బలము ఎంతుందనే విషయంపై ఎవరికీ క్లారిటిలేదు. ఎంతసేపు నాకు అంతుంది, నాబలమింత అని జబ్బలు చరుచుకోవటమే తప్ప రింగ్ లోకి దిగితేనే కదా బలమెంతో తెలిసేది. మొన్నటి ఎన్నికలు కూడా టీడీపీకి లాభం చేయటానికే జనసేన పోటీలోకి దిగలేదనే ఆరోపణలకు పవన్ ఏమి సమాధానం చెబుతారు.





నిజానికి మొన్నటి ఎన్నికల్లో మూడుసీట్లలో టీడీపీ గెలిస్తే రెండుసీట్లలో వైసీపీ గెలిచింది. ఎంఎల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఎవరికీ ఎలాంటి లాభమూ లేదు నష్టమూ లేదు. కాబట్టి ఐదుస్ధానాల్లో కనీసం పట్టభద్రుల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో అయినా అభ్యర్ధులను  పవన్ దింపి ఉంటే బాగుండేది. దీనివల్ల జనసేనకు ఎవరు ఓట్లేస్తారు ? ముఖ్యంగా  యువత+తన అభిమానుల మద్దతు ఏ స్ధాయిలో దక్కుతుందనే విషయమై క్లారిటి వచ్చేది.





ఈ క్లారిటితో వచ్చేఎన్నికల్లో పోటీకి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండేది. ఓటింగ్ సరళిని తెలుసుకునేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని పవన్ తన ఆరాధ్య దైవం చంద్రబాబునాయుడు కోసమని వదిలేసుకున్నారు. దాంతో జనసేన వాస్తవ బలం ఎంతనే విషయం ఎవరికీ తెలీదు. రేపటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే సమయంలో టీడీపీతో సీట్ల బేరాలు చేసేందుకైనా తమ బలం ఇది అనే వాస్తవ అంచనా పవన్ కు ఉండాలి కదా. ఇపుడు అదికూడా లేకుండాపోయింది. మరి రేపటి పొత్తులో కచ్చితంగా తమకు ఇన్నిసీట్లు కావాలనే బేరాన్ని పవన్ ఎలా చేయగలరు ?



మరింత సమాచారం తెలుసుకోండి: