పార్టీ బంధనాల నుండి తమకు విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని నలుగురు ఎంఎల్ఏలు ఎదురు చూస్తున్నారు. ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో జగన్మోహన్ రెడ్డి నలుగురు ఎంఎల్ఏలపైన సస్పెన్షన్ వేటువేశారు. దాంతో నలుగురు ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్వతంత్రులైపోయారు. ఎప్పుడైతే వీళ్ళపై సస్పన్షన్ వేటుపడిందో అప్పటి నుండే వీళ్ళు ఇండిపెండెంట్ ఎంఎల్ఏలు అయిపోయారు.
ఇదే పద్దతిలో టీడీపీలో కూడా నలుగురు ఎంఎల్ఏలున్నారు. వల్లభనేని వంశీ, కరణం బలరామ్, వాసుపల్లి గణేష్, మద్దాలిగిరికి చంద్రబాబునాయుడుతో పడలేదు. దాంతో వీళ్ళంతా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీలో కూడా వీళ్ళ వేరేగా కూర్చుంటున్నారు. బహిరంగంగానే వీళ్ళంతా చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. నాలుగేళ్ళుగా వీళ్ళని చంద్రబాబు భరిస్తున్నారే కానీ పార్టీ నుండి సస్పెండ్ చేయటంలేదు.
జగన్ చేసిన ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారో అర్ధంకావటంలేదు. ఈ నలుగురిని సస్పెండ్ చేసినంత మాత్రాన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షనేత హోదాకు వచ్చిన ముప్పేమీలేదు. టీడీపీ ఎంఎల్ఏలుగా ఉంటూ చంద్రబాబునే తిడుతుంటారు. అయినా వీళ్ళని భరిస్తున్నారు. ఇక్కడే జగన్, చంద్రబాబు వైఖరుల్లో తేడా స్పష్టంగా కనబడుతోంది. జగన్ ఏమో ఎప్పటికప్పుడు విషయాన్ని తెగ్గొట్టేస్తారు. చంద్రబాబు ఏమో విషయాన్ని సంవత్సరాల తరబడి నానుస్తారు. ఎవరిమీదా ఎలాంటి యాక్షన్ తీసుకునేంత సీన్ చంద్రబాబుకు లేదు.
దమ్ముంటే తమను చంద్రబాబు సస్పెండ్ చేయాలని వాసుపల్లి, వంశీలు ఎన్నిసార్లు చాలెంజులు చేసినా చంద్రబాబు నుండి రెస్పాన్స్ లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఎంఎల్ఏలు డబల్ రోల్ వేయాల్సొస్తోంది. అధికారికంగా టీడీపీ ఎంఎల్ఏలుగాను, అనధికారికంగా వైసీపీ మద్దతుదారులుగాను కంటిన్యు అవ్వాల్సొస్తోంది. క్రాస్ ఓటింగుకు పాల్పడిన నలుగురు ఎంఎల్ఏలకు డబల్ రోల్ వేయాల్సిన కష్టంలేకుండా జగన్ ఒకేసారి వేటు వేసేశారు. మరి చంద్రబాబు తన ఎంఎల్ఏలపైన ఎప్పుడు వేటు వేస్తారు ? వాళ్ళని ఎప్పుడు విముక్తం చేస్తారో చూడాల్సిందే.