మార్గదర్శి అనేది ఫక్తు వ్యాపార సంస్ధ. ఈనాడు అనేది ఒక దినపత్రిక. రెండింటికి ఏ విషయంలో కూడా పోలికలు, సంబంధాలు లేవు. మార్గదర్శి వ్యాపారమంతా అక్రమమని, యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా వ్యాపారం చేస్తోందని ప్రభుత్వం కేసులు నమోదుచేసింది. అనేక బ్రాంచీలపై దాడులు చేస్తోంది. దాడుల నేపధ్యంలో ప్రభుత్వానికి యాజమాన్యం సహకరించటంలేదు. అందుకనే దాని ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజపై చీటింగ్ కేసు నమోదుచేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది.
సీన్ కట్ చేస్తే విజయవాడలో తనకు మద్దతుగా ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం అనే సంస్ధను రంగంలోకి దింపింది యాజమాన్యం. మార్గదర్శి మీద దాడులంతా పత్రికాస్వేచ్చమీద దాడిగానే అందరితోను చెప్పించింది. ఈనాడు గొంతునొక్కాలనే మార్గదర్శిపై దాడులు చేస్తోందంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా గోల చేయించింది. మార్గదర్శి మీద దాడులకు, పత్రికా స్వేచ్చకు, ఈనాడు గొంతునొక్కటానికి ఏమి సంబంధం ? మార్గదర్శిలో అక్రమాలు జరిగాయా లేదా అన్నది చూడాలి.
సంస్ధ నిర్వహణే చట్టవిరుద్ధమని ఎప్పుడో తేలిపోయింది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వేలాది కోట్లరూపాయలు వసూలు చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నోసార్లు చెప్పారు. మార్గదర్శి వ్యాపారం చట్ట వ్యతిరేకమని ఆర్బీఐ తేల్చేసిందని ఉండవల్లి చాలాసార్లు చెప్పారు. చిట్ ఫండ్ డబ్బులను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళిస్తున్నట్లు ఆధారాలు బయటపడ్డాయని సీఐడీ అధికారులు చెప్పారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం చిట్ డబ్బులను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించకూడదు. ఇప్పటికే రామోజీరావు, శైలజలను సీఐడీ మొదటి రౌండ్ విచారణ పూర్తిచేసింది.
ఎవరిదగ్గరా చిట్స్ వసూలు చేయమని గతంలో రామోజీ హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చి మోసపూరితంగా చిట్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఉండవల్లి పదేపదే ఆరోపిస్తున్నారు. ఉండవల్లి ఆరోపణల్లో ఒక్కదానికి కూడా రామోజీ సమాధానం ఇవ్వలేదు. వాస్తవాలు ఇలాగుంటే ప్రొఫెషన్ల ఫోరమేమో మార్గదర్శిపై దాడులు అక్రమమని గోలచేస్తోంది. పైగా ఆడిటర్ సంస్ధ బ్రహ్మయ్య అండ్ కో పై దాడులు చేసి ఆడిటర్ శ్రవణ్ ను అరెస్టు చేయటం అన్యాయమంటోంది. అనధికారికంగా మార్గదర్శి లెక్కలను ఆడిట్ చేసి సంతకాలు పెడుతోందనే ఆరపణలపై ప్రభుత్వం ఆడిటర్ ను అరెస్టుచేసింది. ఆ విషయంపై మాట్లాడకుండా పత్రికాస్వేచ్చపైన దాడని గోలచేస్తే ఎవరూ నమ్మరు.