తమ్ముళ్ళు తమ అజెండాను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. ఇంతకీ ఆ అజెండా ఏమిటంటే హిందువులకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం అని ముద్రేయటం. జగన్ క్రిస్తియన్ అనే విషయాన్ని పదేపదే గుర్తుచేసి వైసీపీకి హిందువులు ఓట్లేయకుండా అడ్డుకునే ప్రయత్నంచేయటం. తాజాగా ఒంటిమిట్టలో శ్రీరాముడి దేవాలయంలో జరిగిన సీతారాముల కల్యాణానికి జగన్ హాజరుకాకపోవటం టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పెద్ద అపరాధంగా తోచింది. కల్యాణానికి భార్యతో కలిసి జగన్ ఎందుకు హాజరుకాలేదంటే క్రిస్తియన్ కావటమే కారణమట.
అంటే జగన్ కు హిందువులంటే పడదు కాబట్టే ఒంటిమిట్టకు వెళ్ళలేదని తేల్చేశారు. శ్రీరామనవమి రోజున ఒంటిమిట్టకు వెళ్ళాల్సొస్తుందనే కాలు బెణికిందనే సాకును చూపించారని అచ్చెన్న మండిపడ్డారు. కాలు బెణకటమే నిజమైతే తర్వాత జరిగిన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు చిలకలూరిపేటకు ఎలా వెళ్ళారంటు ప్రశ్నించారు. పనిలోపనిగా ఒంటిమిట్టలో కల్యాణానికి తమ హయాంలో చంద్రబాబునాయుడు హాజరైన విషయాన్ని గుర్తుచేశారు.
హిందువులకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతిచ్చేవారని జగన్ క్రిస్తియన్ కాబట్టి హిందువులంటే చిన్నచూపని అచ్చెన్న తేల్చేశారు. గతంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయంలో కూడా జగన్ పై ఇలాంటి గోలే చేశారు. అప్పట్లో కూడా జగన్ హిందువ్యతిరేకి అనే ముద్రను వేయాలని చాలా ప్రయత్నాలుచేశారు. చంద్రబాబు దగ్గర నుండి కిందస్ధాయి వరకు అందరు చాలా చోట్ల ఇదే విషయాన్ని మాట్లాడేవారు. అయితే చంద్రబాబు, అచ్చెన్న లాంటి వాళ్ళ గోలను జనాలెవరూ పట్టించుకోలేదు.
తిరుమలకైనా, ఒంటిమిట్టకైనా జగన్ వెళ్ళకపోతే జరిగిన నష్టమేంటి ? అంతకుముందు చంద్రబాబు వెళ్ళటం వల్ల జరిగిన లాభమేంటి ? అనేది జనాలు బేరీజు వేసుకున్నారు. అప్పట్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భార్యతో కలిసి జగన్ హాజరుకాకపోవటాన్ని చంద్రబాబు అండ్ కో అరిష్టంగా చిత్రీకరించారు. అయినా వీళ్ళని జనాలు ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ ఇంతకాలానికి ఒంటిమిట్ట ఆలయానికి జగన్ వెళ్ళలేదంటు అచ్చెన్న గొంతు చించుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా బహుశా జగన్ హిందువుల వ్యతిరేకి అనే వాదనను మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్ళే అజెండా మొదలుపెట్టారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.