బీజేపీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తాము పొత్తుపెట్టుకోవాలని అనుకున్న పార్టీలను ఒకరకంగా చూస్తుంది. అలాగే దూరంగా ఉంచాలని అనుకున్న పార్టీలపైన మరో ముద్రవేస్తుంది. పొత్తుల విషయంలో  మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగున్నా ఏపీలో మాత్రం విచిత్రమైన వాదన వినిపిస్తుంటుంది. అదేమిటంటే కుటుంబపార్టీలతో బీజేపీ పొత్తులు పెట్టుకోదని. కుటుంబపార్టీలంటే అవినీతికి కేరాఫ్ అడ్రసలట. అందుకనే వాటికి దూరంగా ఉంటామని చెబుతుంటుంది.





మరి తమ మిత్రపక్షం జనసేన మాటేమిటి అంటే మళ్ళీ నోరెత్తదు. నిజానికి ఏ ప్రాంతీయపార్టీ అయినా కుటుంబపార్టీయే. ప్రాంతీయపార్టీలన్నీ ఆయా పార్టీల అధినేతల ప్రైవేటు ఆస్తిగానే చూస్తుంటారు. పదేపదే నీతులుచెబుతున్న బీజేపీ మరి జనసేనతో మాత్రం పొత్తు ఎలాగ పెట్టుకుంది. తాజా డెవలప్మెంటు ఏమిటంటే సోదరుడు నాగబాబును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రధానకార్యదర్శిగా నియమించారు. ఇప్పటివరకు పార్టీ పీఏసీ సభ్యుడిగా ఉన్న నాగబాబు ఇపుడు ఏకంగా ప్రధాన కార్యదర్శి అయిపోయారు.





అంటే పవన్ తర్వాత అంతటి కీలకహోదా దక్కింది. ఇంతటి కీలకమైన పదవి ఎలా దక్కిందంటే కేవలం పవన్ సోదరుడు కాబట్టే అనటంలో సందేహంలేదు. పార్టీ కీలకపదవుల్లో అన్న దమ్ములిద్దరు ఉన్నపుడు బీజేపీకి జనసేన కుటుంబపార్టీగా కనిపించలేదా ? మిత్రపక్షంలో పవన్ తర్వాత కీలకమైన నేతలు ఎంతమంది ఉన్నారో చెప్పమంటే ఎవరైనా చెప్పగలరా ? పవన్ తర్వాత నాదెండ్ల మనోహర్, నాగబాబు మాత్రమే కదా. విచిత్రం ఏమిటంటే చాలా రాష్ట్రాల్లో అవసరార్ధం బీజేపీ పొత్తుపెట్టుకున్నది ప్రాంతీయపార్టీలతోనే. తమిళనాడులో ఏఐఏడీఎంకే, యూపీలో బీఎస్పీ, మహారాష్ట్రలో శివసేన కుటుంబపార్టీలని తెలీదా ?





కుటుంబపార్టీ కాబట్టి ఇపుడు జనసేనతో పొత్తును బీజేపీ వదులుకుంటుందా ? కేవలం అవసరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫార్ములాను అమలుచేస్తోంది. ఏపీలో ఫార్ములా ఏమిటంటే కుటుంబపార్టీలకు దూరమని. డిపాజిట్లు కూడా తెచ్చుకునేంత సీన్ లేదుకాబట్టి ఇక్కడ నీతులు చెబుతోంది. అదే అధికారంలోకి వచ్చేంత సీనుంటే నీతులన్నీ గట్టునపెట్టేసి అవకాశమున్నందరినీ కావలించుకుంటుంది కుర్చీ కోసం. ఇందులో డౌటే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: