తండ్రి హత్యకేసులో దోషులకు శిక్షలు పడేలా న్యాయపోరాటం చేస్తున్న సునీతకు చంద్రబాబునాయుడు మద్దతుపలికారు. టీడీపీ మాత్రమే కాదని సునీతకు పోలీసులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో టీడీపీ సునీతకు మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీకి సునీత దగ్గరైందనే వార్త చాలాకాలంగా ప్రచారంలో ఉంది. దాదాపు రెండేళ్ళ క్రితం చంద్రబాబుతో భేటీ తర్వాతే సునీత ప్లేటు మార్చారనే ప్రచారం అందరికీ తెలిసిందే.
హత్య జరిగిన తర్వాత తన తండ్రి హత్యలో వైఎస్ కుటుంబసభ్యుల ప్రమేయం లేదని ఇదే సునీత మీడియాతో చాలాసార్లు చెప్పారు. అప్పట్లో ఆమె చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి హస్తముందనే అనుమానాలను కూడా వ్యక్తంచేశారు. అలాంటిది ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారట. అప్పటినుండే సునీతలో మార్పొచ్చిందని వైసీపీ నేతలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి, అవినాష్, భాస్కరరెడ్డిపై ఆరోపణలు మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లో పులివెందుల నుండి సునీత టీడీపీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్న వైసీపీ నేతలు చంద్రబాబు చేతిలో సునీత పావుగా మారిందనే ఆరోపణలు మొదలుపెట్టారు. అందుకనే జగన్ పై బురదచల్లేందుకు సునీత సిద్దపడ్డారని కూడా మంత్రులు మండిపోతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే సునీతకు టీడీపీ పూర్తిమద్దతుగా నిలబడుతుందని చంద్రబాబు ప్రకటించారు. తాజా ప్రకటనతో టీడీపీ-సునీత బంధం బయటపడిందని వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు.
జరుగుతున్నది చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున సునీత పోటీచేస్తారో లేదో తెలీదు కానీ టీడీపీకి అనుకూలంగా ప్రచారమైతే చేయటం ఖాయమని అనిపిస్తోంది. జగన్ను పులివెందులలో ఓడించేందుకు సునీతతో చంద్రబాబు ప్రచారంచేయించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే సునీతకు చంద్రబాబు బహిరంగంగా మద్దతు ప్రకటించినట్లున్నారు. పులివెందులతో పాటు జిల్లా మొత్తం సునీతను తిప్పటం ద్వారా టీడీపీ మ్యాగ్జిమమ్ లాబపడేట్లుగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి చంద్రబాబు ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.