రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్లమెజారిటి సాధించటమే టార్గెట్ గా చంద్రబాబునాయుడు పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టేందుకు పార్టీపరంగా కమిటీలు వేశారు. ఈమధ్యనే గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో గెలిచిన కంచర్ల శ్రీకాంత్ కు బాధ్యతలు అప్పగించారు. కంచర్ల నాయకత్వంలో పనిచేసేందుకు 38 మందితో ఒక సమన్వయ కమిటిని నియమించారు. ఈ కమిటి కాకుండా గ్రామస్ధాయి నుండి కుప్పం హెడ్ క్వార్టర్స్ వరకు పార్టీలో రకరకాల కమిటీలు ఏర్పాటుచేశారు.
ఈ కమిటీలన్నీ నియోజకవర్గంలోని ప్రతి ఇంటని టచ్ చేసి గడచిన 35 ఏళ్ళుగా డెవలప్ అయిన విధానాన్ని జనాలకు వివరించి చెబుతాయి. అలాగే ఓటర్ల జాబితాలను సరిచూసుకోవటం, పోలింగ్ కేంద్రాల వారీగా టీడీపీకి వేసే ఓట్లను గుర్తించటం, సంప్రదాయ టీడీపీ ఓటుబ్యాంకును పటిష్టంచేసుకోవటం, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న జనాలను గుర్తించటం, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ప్రత్యేకించి కుప్పానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించటం తదితరాలన్నింటినీ ఏకకాలంలో చేయాలన్నది చంద్రబాబు టార్గెట్.
వీటిన్నింటినీ సమన్వయం చేసుకునే బాధ్యతలను, అధికారాలను కంచర్లకు ఇచ్చారు. వారంలో మూడురోజులు కంచర్ల కుప్పంలోనే ఉండాలని ఆదేశించారు. ఎంఎల్సీ కూడా కుప్పంలో నివాసం ఏర్పాటుచేసుకున్నారు. నియోజకవర్గంలో తన పట్టుని నిరూపించుకోవాలన్నది చంద్రబాబు పట్టుదల. నిజానికి ఇపుడు పార్టీపరంగా తీసుకుంటున్న చర్యలన్నీ కొత్తగా ఉన్నాయనే చెప్పాలి. ఇంతవరకు ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు.
వచ్చేఎన్నికల్లో చంద్రబాబును ఓడించటమే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్ది పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం తరపున అమలవుతున్న సంక్షేమపథకాలన్నీ జనాలకు అందేట్లుగా చూస్తున్నారు. కుప్పంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ బాధ్యతలన్నింటినీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. అభ్యర్ధిగా భరత్ ను చాలాకాలం క్రితమే ప్రకటించారు. భరత్ కూడా ప్రతిరోజు నియోజకవర్గంలో తిరుగుతునే ఉన్నారు. జగన్ స్పీడుచూసిన తర్వాత మొదటికే మోసం వస్తుందనే భయంతోనే చంద్రబాబు తాజాగా రకరకాల కమిటీలను నియమించారు. ఎలాగైనా లక్ష ఓట్లు మెజారిటి రావాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరిద్దరిలో ఎవరి టార్గెట్ గెలుస్తుందో చూడాల్సిందే.