రాజకీయాలు కూడా డిమాండ్ సప్లై పద్దతిలో బేరసారాల్లాగే అయిపోయింది. దాంతో వేలంపాటల పద్దతి అమల్లోకి వచ్చేస్తున్నట్లుంది. ఇపుడు ఇదంతా ఎందుకంటే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజా వ్యవహారం అచ్చం వేలపాటల్లాగే అనిపిస్తోంది. వీళ్ళిద్దరు బీఆర్ఎస్ లో ఉండగానే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీతో రెగ్యులర్ టచ్ లో ఉండేవారు. పార్టీ నుండి వీళ్ళని బయటకు పంపేసిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ నేతలు వీళ్ళతో మంతనాలు మొదలుపెట్టారు.
రెండుపార్టీల నేతలు ఎవరికి వాళ్ళుగా తమ పార్టీల్లో చేరమని వీళ్ళకి ఆఫర్లిచ్చారు. ముందు బీజేపీ తరపున ఈటల రాజేందర్ ఫోన్లో ఇద్దరితోను మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా వీళ్ళద్దరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజాగా ఖమ్మంలో పొంగులేటి ఇంటిలో వీళ్ళద్దరితో ఈటల డైరెక్టుగా సమావేశమయ్యారు. అంటే ఒకసారి కాంగ్రెస్ తోను ఆ తర్వాత బీజేపీతోను జూపల్లి, పొంగులేటి భేటీలు జరుపుతున్నారు.
మామూలుగా అయితే రెండుపార్టీల నేతలతో ఒకసారి భేటీ అవ్వటంలో తప్పులేదు. తమకు ఏ పార్టీ నుండి ఎక్కువ అవకాశాలు, డిమాండ్లు అంగీకరిస్తుందని అనుకుంటే ఆ పార్టీలో చేరటం సహజం. కానీ ఇక్కడ జూపల్లి, పొంగులేటి ఒకసారి ఒకపార్టీతో మరోసారి ఇంకోపార్టీతో భేటీ అవుతున్నారు. రెండుపార్టీల నుండి వచ్చిన ఆఫర్లను విశ్లేషించుకుని రెండు ఆఫర్లలో తమకేది లాభమో నిర్ణయించుకుని ఎక్కువ ఆఫర్లిచ్చిన పార్టీని చూపించి మళ్ళీ రెండోపార్టీతో బేరాలు మాట్లాడుకుంటున్నట్లున్నారు.
అందుకనే ఒక్కోపార్టీతో రెండు మూడుసార్లు భేటీలవుతున్నారు. తమకు డిమాండ్ బాగా ఉందనుకుని ఎదుటిపార్టీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేలంపాట పద్దతిలో తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఇద్దరు ప్లాన్ చేసినట్లున్నారు. అందుకనే ఏ పార్టీలో చేరుతారన్న విషయాన్ని తేల్చకుండా బాగా నాన్చుతున్నారు. ఇదే విధంగా చేస్తే వీళ్ళ వైఖరితో రెండుపార్టీలు విసిగిపోవటం ఖాయం. చివరకు రెండుపార్టీలు వదిలేస్తే వీళ్ళిద్దరు ఏ పార్టీకి కాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. అంటే మొదటికే మోసం అన్నమాట. మరి వీళ్ళు ఏమిచేస్తారో చూడాల్సిందే.