మంత్రి గుడివాడ అమర్నాధ్ కు ధైర్యం ఎక్కువగానే ఉన్నట్లుంది. వచ్చేఎన్నికల్లో తన గెలుపుపై గట్టి ధీమాతోనే ఉన్నట్లున్నారు. అందుకనే గడపగడపకి వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తాను చెప్పిన పనులు పూర్తిచేయకపోతే తాను ఓట్లు అడగనని, అడిగినా తనకు ఓట్లేయద్దని చెప్పేశారు. తన నియోజకవర్గం అనకాపల్లిలోని మూలపేట గ్రామంలో మంత్రి పర్యటించారు. మంత్రి వచ్చారు కాబట్టి జనాలు గుడిగూడినపుడు గ్రామంలో రోడ్లు సరిగా లేవని, మంచినీటి సౌకర్యం కూడా లేదని చాలా సమస్యలు చెప్పుకున్నారు.
మంత్రి మాట్లాడుతు గ్రామంలో పరిస్ధితులను తెలుసుకునేందుకే తాను వచ్చినట్లు చెప్పారు. కొన్ని సమస్యల పరిష్కారానికి మంత్రి వెంటనే నిధులు మంజూరు చేయటంతో పాటు మరికొన్నింటి విషయంలో అధికారులు, కలెక్టర్ తో మాట్లాడారు. దశలవారీగా అన్నీ పనులను ప్రారంభించి పూర్తిచేసే బాధ్యత తనదే అని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామల్లో పరిస్ధితులను గడచిన ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే ఇపుడీ సమస్యలు వచ్చినట్లు మండిపడ్డారు.
ఇలా ఎంతకాలం గత ప్రభుత్వాన్ని తప్పుపడుతు కూర్చుంటారో తెలీదు. అయితే ఈ నేపధ్యంలోనే చెప్పిన పనులను, హామీలన్నింటినీ నెరవేర్చకపోతే వచ్చేఎన్నికల్లో ఓట్లు అడగనని, పనులు చేశాననే తృప్తిలేకపోతే తనకు ఓట్లు వేయద్దని స్పష్టంగా అమర్నాధ్ చెప్పేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటు వెళుతోందన్నారు. సరే ఈ ఉపన్యాసాలకు కొదవేమీ లేదు కానీ ఇంతకీ నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చగలరా ? అన్నదే ప్రశ్న.
ప్రభుత్వ ఆదాయంతో పాటు తెస్తున్న అప్పుల్లో ఎక్కువభాగం సంక్షేమ పథకాల అమలుకే జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తున్నారు. అందుకనే డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధుల కేటాయింపు పెద్దగా ఉండటంలేదు. మరి ఏ ధైర్యంతో హామీలు నిలుపుకోకపోతే తనకు ఓట్లేయద్దని మంత్రి చెప్పారో అర్ధంకావటంలేదు. అంతాబాగానే ఉందికానీ అసలు అమర్నాధ్ వచ్చేఎన్నికల్లో అనకాపల్లిలో పోటీచేస్తారా ? అన్నది చిన్న సందేహం. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో మంత్రి గాజువాక నుండి పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.