జూనియర్ ఎన్టీయార్ కు గాలమేస్తున్నట్లే ఉన్నారు. లేకపోతే ఇంతకాలం అవసరంలేని, గుర్తుకురాని జూనియర్ ను ఇప్పుడే ఎందుకని ఆహ్వానించారు. పనిగట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళి మరీ ఆహ్వానించారంటే ఏదో అవసరం ఉంటుందని అనుకోబట్టే అనుకోవాలి. ఈనెల 20వ తేదీన హైదరాబాద్ లో ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలను టీడీపీ ఘనంగా జరపేందుకు రెడీ అవుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగానే జూనియర్ ఇంటికి బాబాయ్ నందమూరి రామకృష్ణ, ఉత్సవాల కమిటి ఛైర్మన్ టీడీ జనార్ధనరావు వెళ్ళి ఆహ్వానించారు. అయితే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువని చెప్పేశారట. మాల్దీవులకు వెళుతున్న కారణంగా కార్యక్రమానికి హాజరవటం సాధ్యంకాదన్నారట.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎప్పటినుండో శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నా ఇప్పటివరకు జూనియర్ ను ఎప్పుడు ఆహ్వానించలేదు. ఏ ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఈమధ్యనే విజయవాడకు దగ్గరలోనే ఉన పోరంకిలో జరిగిన కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదు. పైగా ఆ కార్యక్రమానికి తమిళనటుడు రజనీకాంత్ ను పిలిచారు. ఇంతకాలం జూనియర్ ను కావాలనే అందరు కలిసి దూరంగా ఉంచేశారు.
పోరంకి కార్యక్రమంలో ఎక్కడో ఉన్న రజనీకాంత్ ను పిలిచి మనవడైన జూనియర్ ను దూరంగా ఉంచటంపై అభిమానులు బాగా మండిపోయారు. సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. దాంతో ఏమనుకున్నారో ఏమో ఎలాగూ ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా. అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జూనియర్ ను హైదరాబాద్ లో జరగబోయే శతజయంతి ఉత్సవాలకు పిలిచారు. ముందు తెలంగాణాలోను తర్వాత ఏపీ ఎన్నికల్లోను జూనియర్ సేవలను ఉపయోగించుకోవాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేసినట్లున్నారు.
చంద్రబాబు ఏపనిచేసినా అనాలోచితంగా చేసేరకం కాదు. పైగా పార్టీలో కొడుకు లోకేష్ కు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని అసలు జూనియర్ పేరుకూడా వినబడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇంతకాలం జరిగిన కార్యక్రమాలకు జూనియర్ ను దూరంగా ఉంచటానికి కారణముంది. అదేమిటంటే స్టేజి మీద తమతో పాటు జూనియర్ కూడా ఉంటే జనాల అటెన్షన్ మొత్తం తనవైపే ఉంటుందన్న ఆలోచనతో కూడా జూనియర్ ను దూరంగా ఉంచేశారు. ఇపుడు విమర్శలు+రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్లున్నారు. అందుకనే జూనియర్ కు ప్రత్యేక ఆహ్వానం అందించారు.