లోకేష్ పాదయాత్ర సందర్భంగా పార్టీలోని రెండువర్గాల మధ్య జరిగిన గొడవ పార్టీకి పెద్ద సమస్యగా మారబోతోందా ? యువగళంలో భాగంగా లోకేష్ నంద్యాలకు వచ్చినపుడు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. భూమా, ఆమె భర్త భార్గవ్ పై ఏవీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దంపతులను అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఇద్దరికీ 14 రోజుల రిమాండు విధించింది. జరిగిన గొడవపై వారంరోజుల్లో సమాధానం చెప్పాలని పార్టీ క్రమశిక్షణాసంఘం అఖిలకు షోకాజ్ నోటీసిచ్చింది.
ఇవన్నీ పక్కనపెట్టేస్తే ఏవీ కూతురు చంద్రబాబుకు అల్టిమేటమ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తన తండ్రిపై అఖిల వర్గం దాడికి సంబంధించి ఏవీ కూతురు జస్వంతి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో అఖిలపై ధ్వజమెత్తిన తర్వాత చంద్రబాబుకు కూడా అల్టిమేటమ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో అఖిలకు గనుక చంద్రబాబు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చింది. చిన్నప్పటినుండి కూతురులాగ ఎత్తుకుని పెంచిన తన తండ్రి ఏవీపైనే అఖిల హత్యాయత్నంకు పాల్పడుతుందా అంటు మండిపోయింది.
వచ్చేఎన్నికల్లో అఖిలకు టికెట్ ఇస్తే తాను, తన తండ్రితో పాటు తండ్రి మద్దతుదారులంతా కలిసి ఓడించటం ఖాయమని చెప్పింది. కాబట్టి ఎట్టి పరిస్ధితిలోను అఖిలకు చంద్రబాబు టికెట్ ఇవ్వకూడదని గట్టిగా చెప్పింది. అలాగే రాబోయే ఎన్నికల్లో తాను కానీ లేదా తన తండ్రి కానీ పోటీచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చంద్రబాబు అవకాశమిస్తే తాము పోటీచేయటానికి రెడీగా ఉన్నామన్నది. పార్టీ ఆదేశాల ప్రకారమే తాను ప్రెస్ మీట్ పెట్టడంలేదని గుర్తుచేశారు.
మీడియా సమావేశం పెట్టి గొడవను పెంచద్దని పార్టీ చెప్పింది కాబట్టే వీడియో రిలీజ్ చేయాల్సొచ్చిందని జస్వంతి క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి నంద్యాలలో జరిగిన గొడవ ఇక్కడితో ఆగేట్లు కనబడటంలేదు. అసలే ఇద్దరి మధ్య సంబంధాలు ఉప్పునిప్పులాగున్నాయి. ఒకసారి ఏవీ హత్యకు కుట్ర జరిగిందని పోలీసులే చెప్పారు. దానిపైన తాజాగా అఖిల ఉండగానే ఆమెవర్గం ఏవీపైన దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. తనపైన జరిగిన దాడిని ఏవీ అంత తేలిగ్గా మరచిపోతారా ?