విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఓ ఆటాడుకుంటున్నారు. పార్టీలో నుండి బయటకు రారు అలాగని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు. తనిష్టం ఉంటే పాల్గొంటారు లేకపోతే తన ఆఫీసులో కూర్చుంటారు. పైగా కొద్దిరోజులుగా వైసీపీ ఎంఎల్ఏల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈమధ్యనే నందిగామ వైసీపీ ఎంఎల్ఏ మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడు ఎంఎల్ఏ బాగా పనిచేస్తున్నట్లు ఎంపీ కితాబిచ్చారు. దాంతో టీడీపీలో అందరు ఎంపీపై మండిపోతున్నారు. ఆ వేడి చల్లారకముందే ఇపుడు మైలవరం ఎంఎల్ఏతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతు చంద్రబాబునాయుడు అంటే లెక్కలేని తనాన్ని ప్రదర్శించారు.
ఎంపీ ఏమంటారంటే వచ్చేఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అన్నారు. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్ధిగా అయినా పోటీచేయటానికి రెడీ అని చాలెంజ్ విసిరారు. ఇదే సమయంలో తనను పిలిచి ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున పోటీచేయటానికి కూడా రెడీ అన్నారు. తనకు టీడీపీ టికెట్ ఇస్తుందా ఇవ్వదా ? తాను గెలుస్తానా గెలవనా ? అనే భయంలేదన్నారు. తాను చేసినన్ని అభివృద్ధి కార్యక్రమాలను దేశంలో ఏ ఎంపీకూడా చేసుండరని చెప్పారు.
హోలుమొత్తంమీద తాను ప్రజల మనిషినే కానీ పార్టీ మనిషిని కానని స్పష్టంగా చెప్పేశారు. కేశినేని తాజా వ్యాఖ్యలతో చంద్రబాబుతో పాటు నేతలు కూడా అయోమయంలో పడిపోయారు. ఎంపీకి మళ్ళీ టికెట్ ఇవ్వాలా వద్దా ? ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే మరో సమస్యగా తయారైంది. చూడబోతే కేశినేని టీడీపీ తరపున పోటీచేసే అవకాశాలు తక్కువనే అనిపిస్తోంది. బహుశా వైసీపీ తరపునో లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తారేమో. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీచేస్తే కేశినేని సత్తాఏమిటో తెలీటంతో పాటు టీడీపీ ఓటమికి కారణమవుతారేమో.