రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ, జనసేనలు జగన్మోహన్ రెడ్డిని మూడువైపుల నుండి చుట్టుముడుతున్నట్లే ఉంది. ఒకవైపు లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. మరోవైపు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైంది. ఇంకోవైపు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర మొదలవ్వబోతోంది. షెడ్యూల్ ప్రకారం కాకుండా ముందస్తు ఎన్నికలు రావటం ఖాయమని చంద్రబాబు, పవన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకనే పార్టీ నేతల్లో జోష్ పెంచటానికి వీలుగా రెండుపార్టీలు ఒక్కసారిగా యాత్రలకు ప్లాన్ చేశాయి.
లోకేష్ 125 రోజులు రాయలసీమలో పాదయాత్రను పూర్తిచేసుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. లోకేష్ పాదయాత్రతో జనాల్లో ఏదో మార్పు వచ్చేస్తుందని, ప్రజలంతా టీడీపీకి ఓట్లేసేసి గెలిపించేస్తారని ఎవరు అనుకోవటంలేదు. పాదయాత్ర అలా సాగుతుండగానే సడెన్ గా పవన్ వారాహి యాత్రని మొదలుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడులో బుధవారం రాత్రి బహిరంగసభతో యాత్ర మొదలైంది. సభలో జగన్మోహన్ రెడ్డిపై ఎప్పుడూచేసే రొటీన్ ఆరోపణలు తప్ప కొత్తేమీలేదు. పదేపదే జగన్ను తిట్టి తన కసినంతా తీర్చుకున్నారు.
వారాహి యాత్ర తొమ్మిదిరోజులు జరగబోతోంది. ఇది ఒకవైపు మొదలవ్వగానే ఈనెల 19వ తేదీనుండి టీడీపీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర మొదలవ్వబోతోంది. 125 నియోజకవర్గాల్లో 30 రోజులు 5 బస్సుల్లో యాత్ర మొదలవుతుంది. ఇందులో ఎంఎల్ఏలు, సీనియర్ తమ్ముళ్ళుంటారు. రాజమండ్రి మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మొదటివిడత మ్యానిఫెస్టోలోని అంశాలను జనాల్లోకి తీసుకెళ్ళటానికే బస్సుయాత్రలు చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు చంద్రబాబు ఆశించినట్లు మ్యానిఫెస్టో జనాల్లోకి వెళ్ళలేదని అర్ధమవుతోంది.
ఒకవైపేమో జగన్ చాలా నింపాదిగా ఉన్నారు. ఎంతమంది కలిసొచ్చినా గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారు. జగన్ ధీమాతో చంద్రబాబు, పవన్లో అయోమయం పెరిగిపోతున్నట్లుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించలేకపోతే టీడీపీ, జనసేన రెండింటికి భవిష్యత్తు కష్టమే. ఈ రెండుపార్టీలకు ఒకవిధంగా రాబోయే ఎన్నికలే చివరి ఎన్నికలని అనుకోవచ్చు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రెండోసారి గెలుపుపై జగన్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అందుకనే ప్రతిపక్షాల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. జగన్ను మూడువైపుల నుండి కమ్ముకుంటే తప్ప ఓడించలేమని డిసైడ్ అయినట్లున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.