రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రాంతాలవారీగా సోషల్ ఇంజనీరింగ్ అప్లై చేయటానికి మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో 151 సీట్ల అఖండ మెజారిటితో గెలిచారంటే అప్పట్లో అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. కులాలు, మతాల వారీగా జనాభాలెక్కల ఆధారంగా టికెట్లు కేటాయించటాన్నే ముద్దుగా సోషల్ ఇంజనీరింగ్ అనంటున్నారు. నిజానికి ఈ పద్దతి ఇపుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. చాల సంవత్సరాలుగా అమల్లో ఉన్నదే. కాకపోతే అప్పట్లో బయటకు పెద్దగా మాట్లాడేవారు కాదు. ఇపుడు అదే విషయాన్ని బహిరంగంగా గొప్పగా చెప్పుకుంటున్నారంతే.





ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు, బీసీలు, ఎస్సీల జనాభా ఎక్కువ. అందుకనే బీసీ+ఎస్సీ+జాలరి సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించాలని జగన్ డిసైడ్ అయ్యారట. జాలర్లు కూడా బీసీల్లోకి వస్తారు అయినా ప్రత్యేకంగా నాలుగు ఐదు నియోజకవర్గాల్లో జాలర్లే డిసైడింగ్ ఫ్యాక్టరట. అందుకనే జాలర్లను ప్రత్యేకంగా చూస్తున్నట్లు సమాచారం. ఇక బీసీలంటే ముఖ్యంగా తూర్పుగోదావరిలో శెట్టిబలిజలనే అర్ధం. కాపు-శెట్టిబలిజలకు దశాబ్దాల వైరముంది. అందుకనే వ్యూహాత్మకంగా శెట్టిబలిజలు, కాపుల మధ్య క్లాష్ రాకుండా వేర్వేరుగా టికెట్లను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.





ఇక రాయలసీమలో బలిలజ(కాపు)లు, బీసీ(యాదవులు), రెడ్లు, ముస్లింలు, ఎస్సీలు ఎక్కువ. నియోజకవర్గాల్లో  జనాభా ఆధారంగా టికెట్లు కేటాయించబోతున్నారట. ఇక కోస్తాలో కాపులు, ఎస్సీలు, బీసీలు ఎక్కువ. అక్కడక్కడ ముస్లింలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కాంబినేషన్లో టికెట్ల కేటాయింపు చేయబోతున్నారు.





ఇక ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమలు, కాళింగులు, బీసీ (బెస్తలు), ఎస్సీలు ఎక్కువ. కాబట్టి సహజంగానే ఇదే కాంబినేషన్లో టికెట్లు ఇవ్వబోతున్నారు. ఇక జనరల్ గా తీసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో క్షత్రియులు, రెడ్లు, కమ్మోరి ప్రాబల్యం కనబడుతుంది. కాబట్టి లోకల్ అవసరాలకు తగ్గట్లుగా వీళ్ళకు కూడా టికెట్లు కేటాయించక తప్పదు. ఇక బ్రాహ్మణులు, వైశ్యుల జనాభాతో పాటు ప్రభావం కూడా తక్కువనే చెప్పాలి. అయినా ఏదో జిల్లాలో రెండో, మూడో సీట్లు అడ్జస్టు చేస్తారు. పోయిన ఎన్నికల్లో జనరల్ సీట్లలో కూడా బీసీలకు టికెట్లు కేటాయించటమే జగన్ కు బాగా ప్లస్సయ్యింది. మరి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: