జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. వారాహియాత్ర నాలుగోరోజున కాకినాడకు చేరుకున్నారు. పార్టీ నేతలతో సమీక్షలో మాట్లాడుతు తనను అంతంచేయటానికి వైసీపీ సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపినట్లు తనకు కచ్చితమైన సమాచారం ఉందన్నారు. అధికారం కోసం వైసీపీ ఎంతకైనా తెగిస్తుందని తనకు తెలుసన్నారు. తన యాత్రలో పాల్గొనే నేతలు, వీరమహిళలు, క్యాడరంతా భద్రతా నియమాలను పాటించాల్సిందే అని చెప్పారు.
పవన్ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలపై ఇపుడు పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. పవన్ను అంతంచేయటానికి సుపారీ గ్యాంగులను దింపాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చింది అనే ప్రశ్నకు జనసేనాని సమాధానం చెప్పటంలేదు. నిజానికి గ్రౌండ్ లెవల్లో పార్టీ ఎంతబలంగా ఉందో ఎవరికీ తెలీదు. తన పార్టీ చాలాబలంగా ఉందని పవన్ అనుకుంటున్నారు. ఇలా అనుకునే పోయిన ఎన్నికల్లో కూడా రెండుచోట్ల పోటీచేసి బోర్లాపడ్డారు. ఇపుడు పవన్ను అంతంచేస్తే వైసీపీకి ఏమొస్తుంది ? అనవసరంగా జనసేనకు సింపతి తెప్పించినట్లవుతుంది. గత ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబునాయుడు, లోకేష్ నుండి ప్రాణహాని ఉందని పవన్ గోలగోల చేసిన విషయం తెలిసిందే.
పవన్ను అలాగే వదిలేస్తే రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్లు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చంతే. అంతేకానీ అధికారంలోకి అయితే వచ్చేది లేదు. అధికారం పోతుందన్న భయంతోనే పవన్ను అంతం చేయాలని అనుకుంటే మరి చంద్రబాబునాయుడు మాటేమిటి ? వైసీపీ అసలు సమస్య టీడీపీనే కానీ జనసేన కాదు కదా. బలమైన ప్రత్యర్ధిగురించే వైసీపీ ఆలోచిస్తుంది కానీ బలహీనంగా ఉన్న పవన్ గురించి ఎందుకు ఆలోచిస్తుంది ?
పవన్ చేసిన వ్యాఖ్యలు ఏదో డ్రామాలాగే అనిపిస్తోంది. ముందుజాగ్రత్తగా ఏదో ఒక మాటేసుంచారంతే. కాకినాడ ఎంఎల్ఏ ద్వారపూడి చంద్రశేఖరరెడ్డికి, పవన్ కు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుంది. చాలాసార్లు ఇద్దరు ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకున్నారు. పిఠాపురం నుండి పవన్ అదేపనిగా ద్వారపూడిని చాలాసార్లు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కాబట్టి ఎంఎల్ఏ మనుషులు ఏమైనా దాడిచేస్తారేమో అని పవన్ భయపడుతుండచ్చు. ఆ మాటచెప్పకుండా వైసీపీ..సుపారీ గ్యాంగులు, హత్యంటు ఏదేదో మాట్లాడుతున్నారు.