సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఎన్డీయే, నాన్ ఎన్డీయే పక్షాల వ్యూహ, ప్రతి వ్యూహాలు పదునెక్కిపోతున్నాయి. ఎన్డీయే తరపున నరేంద్రమోడీ రంగంలోకి దిగారు. నాన్ ఎన్డీయే పార్టీల తరపున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. విషయం ఏమిటంటే అటు ఎన్డీయేకి ఇటు నాన్ ఎన్డీయే పార్టీలకు దాదాపు ఒకేరకమైన సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ముందుగా నరేంద్రమోడీ వ్యూహం చూస్తే ఎన్డీయేని బలోపేతం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఒకపుడు ఎన్డీయేలో ఉండి తర్వాత బయటకు వెళ్ళిపోయిన పార్టీలను మళ్ళీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటకలో జేడీఎస్, ఏపీలో టీడీపీ, పంజాబ్ లో అకాలీదళ్ లాంటి పార్టీలతో మంతనాలు జరుగుతున్నాయి. పదేళ్ళ పాలన వల్ల జనాల్లో మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత రావటం సహజం. ఉత్తరాధిలో వ్యతిరేకత కనబడుతోంది. దక్షణాదిలో బీజేపీకి చెప్పుకోదగ్గ మిత్రపక్షమే లేదు. అందుకనే అర్జంటుగా మిత్రలను కలుపుకుంటున్నారు.
ఇక నితీష్ ప్రయత్నాలు చూస్తే బీజేపీ అంటే పడని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తన ప్రయత్నాల్లో నితీష్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈనెల 23వ తేదీన పాట్నాలో 20 ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశానికి హాజరయ్యే పార్టీల అధినేతలు కీలకమైన అంశాలను చర్చించబోతున్నారు. అసలు ఎంతమంది పార్టీల అధినేతలు హాజరవుతారు అన్నదే కీలకం. ఇంతమందిని ఒకచోట చేర్చటమే నితీష్ సక్సెస్. కాంగ్రెస్ అంటే మండిపోయే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ అధినేతలు మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇపుడు సానుకూలంగా మారారు.
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత ప్రతిపక్ష నేతల వైఖరుల్లో బాగా మార్పొచ్చింది. కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేయటానికి, కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి సిద్ధపడుతున్నారు. 23వ తేదీ మీటింగుకు ప్రతిపక్షాలు హాజరుకాకుండా బీజేపీ అడ్డుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఎంత బలంగా తయారైతే ఎన్డీయేకి అంత నష్టమని అందరికీ తెలిసిందే. ఇపుడు గనుక బీజేపీని ఓడించకపోతే ముందు ముందు కష్టమని భావించబట్టే చాలా ప్రతిపక్షాలు ఏకమవ్వటానికి రెడీ అవుతున్నాయి. మరి 23వ తేదీన ఏమి జరుగుతుందో చూడాల్సిందే.