![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ramoji-rao-sailaja-margadarsi-cid397b3d4a-987a-47e9-b271-0fc7b33541b4-415x250.jpg)
మార్గదర్శి చీటింగ్ కేసులో మామ రామోజీరావు, కోడలు శైలజకు సీఐడీ పెద్ద షాకే ఇచ్చింది. మార్గదర్శికి రామోజీరావు ఛైర్మన్ గాను శైలజ ఎండీగా ఉన్న విషయం తెలిసిందే. మార్గదర్శి మోసాలపై సీఐడీ ఇద్దరిపైనా కేసులు నమోదుచేసి ఏ1, ఏ2గా విచారిస్తున్నది. ఇద్దరినీ రెండుసార్లు హైదరాబాద్ లో వాళ్ళింట్లోనే విచారించింది. మూడో విచారణకు ఇద్దరినీ గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీసులో జూలై 5వ తేదీన హాజరవ్వాలని నోటీసు ఇచ్చింది.
ఇదివరకు ఇద్దరినీ తమ ఆఫీసులో విచారణకు హాజరవ్వాలని కోరబోతున్నట్లు సీఐడీ అధికారులు చెప్పారు. అయితే ఎందుకనో విచారణ నెమ్మదించినట్లుగా అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే సంస్ధకు చెందిన రు. 1065 కోట్ల ఆస్తులను సీఐడీ జప్తుచేసింది. మార్గదర్శి ఆస్తులను సీఐడీ జప్తుచేయటమే సంచలనం. అలాంటిది ఇపుడు వాళ్ళిద్దరిని విచారణకు తమ ఆఫీసుకే రమ్మని చెప్పటం అంటే ఇంకా పెద్ద సంచలనమనే చెప్పాలి.
87 ఏళ్ళ రామోజీ, శైలజ మొదటినుండి కూడా సీఐడీకి పెద్దగా సహకరించటంలేదు. సీఐడీ అధికారులు ఎన్నిగంటల పాటు విచారణ జరిపినా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదు. తాము ఎన్ని ప్రశ్నలు అడిగినా వీళ్ళిద్దరు తమకు సహకరించటంలేదని సీఐడీ అధికారులే ప్రకటించారు. తమకు సహకరించకపోగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నట్లు దర్యాప్తు అధికారులు మండిపోయారు. తామడిగిన ప్రశ్నల్లో శైలజ అయితే కేవలం 25 శాతం ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పటంలేదని సీఐడీ అధికారులు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
బహుశా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే ఏమో జరగబోయే విచారణలో వీళ్ళిద్దరినీ తమ ఆపీసుకే రమ్మని నోటీసులిచ్చారు. మరి సీఐడీ ఆఫీసులో విచారణంటే తమింట్లో జరిగినట్లు జరగదన్న విషయం వీళ్ళకు తెలిసే ఉంటుంది. మరి సీఐడీ ఆఫీసుకు వెళ్ళి విచారణకు హాజరవుతారా లేకపోతే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికి రెండుసార్లు రామోజీ వేసిన పిటీషన్లకు కోర్టు సానుకూలంగా స్పందించలేదు కాబట్టే.