ఎల్లోమీడియాలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ చదివిన తర్వాత చాలామందికి ఇదే అనుమానం వచ్చుంటుంది. ఈ మాత్రందానికి ఇప్పుడే వారాహియాత్ర ఎందుకు చేస్తున్నట్లు ? అనే సందేహం పెరిగిపోతోంది. యాత్ర మొదలైన దగ్గర నుండి పవన్ జనాలను ఏమడుగుతున్నారు ? జనసేనకు ఓట్లేసి అధికారం కట్టబెట్టమని. తనకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించమని. సీఎం అయిన రెండేళ్ళ తర్వాత కూడా తాను ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా పనిచేయలేదని అనుకుంటే వెంటనే రాజీనామా చేసేస్తానని కూడా ప్రకటించారు.
పవన్ మాటలు, ప్రకటనలతో అభిమానులు, జనసేన నేతలు, క్యాడర్ కూడా చొక్కాలు చించేసుకున్నారు. ఇంకేముంది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే పవన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటమే మిగులుందన్నట్లుగా రెచ్చిపోతున్నారు. అయితే వాళ్ళ ఉత్సాహమంతా అదేదో సినిమాలో కమేడియన్ ఆలీ వేసుకున్న డ్రస్సుకు గుండుసూది గుచ్చి గాలి తీసేసినట్లయిపోయింది. ఎందుకంటే ఎల్లోమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తానేంటి ముఖ్యమంత్రి ఏమిటని ఎదురు ప్రశ్నించారు.
యాత్ర మొదలైన దగ్గరనుండి తన వాళ్ళంతా సీఎం సీఎం అంటుంటే వాళ్ళకోసమనే తనను సీఎంగా గెలిపించమని అడిగానంతే అని చాలా సింపుల్ గా చెప్పేశారు. తన ఇంటర్వ్యూ చదివిన జనాలు తన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అంచనా వేసుకుంటారనే ఆలోచన కూడా పవన్లో కనిపించలేదు. జనసేనను అధికారంలోకి తీసుకొచ్చి తాను ముఖ్యమంత్రి అవటానికి కాకపోతే ఇప్పుడీ వారాహి యాత్ర ఎందుకు ? చివరకీ యాత్రే కొంపముంచేసేట్లుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అదేదో పొత్తులు డిసైడ్ అయినాకే మిత్రపక్షాల నేతలతో కలిసి యాత్ర మొదలుపెట్టుంటే అభ్యర్ధులను కూడా జనాలకు పరిచయం చేసినట్లుండేది కదా. ఇపుడు చేస్తున్న యాత్రకు ఎంత డబ్బులు ఖర్చవుతున్నాయో తెలీదు. ఒకేసారి పొత్తులు ఫైనల్ అయినతర్వాత నేతలు+అభ్యర్ధులతో ప్రచారం మొదలుపెడితే డబ్బులు, నేతల శ్రమ, సమయం అంతా కలిసొచ్చేది. పవన్ తాజా ఇంటర్వ్యూ చూసిన తర్వాత అదేదో పాటలో చెప్పినట్లుగా ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అని అనిపిస్తోంది. మండుటెండల్లో నేతలంతా మాళ్ళు పగలకొట్టుకుని, చొక్కాలు చించుకుని యాత్రకోసం ఒళ్ళు హూనం చేసుకుంటుంటే పవనేమో చంద్రబాబునాయుడే సీఎం అన్నట్లుగా చెబుతారా ?