జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ టార్గెట్లలో ఎంత తేడా ఉందో చూడండి. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175కి 175 సీట్లూ వైసీపీనే గెలవాలన్నది జగన్ టార్గెట్. నిజానికి ఈ టార్గెట్ రీచయ్యే అవకాశం లేదనే చెప్పాలి. జగన్ టార్గెట్ రీచవ్వటం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిదికాదు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం ఉన్నపుడే అధికారపార్టీకి స్పీడు బ్రేకులు వేసినట్లుంటుంది. బలమైన ప్రతిపక్షం లేకపోతే నియంతృత్వానికి దారితీస్తుంది. నియంతృత్వమే మొదలైతే ప్రజాస్వామ్యానికి చేటు మొదలైనట్లే.
ఇక పవన్ టార్గెట్ చూద్దాం. 34 కి 34 సీట్లలో ఎక్కడా వైసీపీ గెలవకూడదని పవన్ పదేపదే చెబుతున్నారు. ఈ 34 సీట్ల లెక్కేమిటంటే ఉభయగోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుంటే పశ్చిమగోదావరి జిల్లాలో 15 ఉన్నాయి. మొత్తం సీట్లలో ప్రస్తుతం వైసీపీ ఖాతాలో 26 నియోజకవర్గాలున్నాయి. మరి పవన్ చెబుతున్నట్లు వచ్చేఎన్నికల్లో వైసీపీని 34 సీట్లలోను ఓడించటం సాధ్యమేనా ? ముందు దేశమన్నారు. తర్వాత నా రాష్ట్రమన్నారు. తీరాచూస్తే ఇపుడేమో గోదావరి జిల్లాలకే పరిమితైపోయారు.
ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న పద్దతిలో పవన్ ఎందుకని ఒక్కసీటులో కూడా వైసీపీని గెలవనివ్వను అని పదేపదే చెబుతున్నట్లు ? అంతర్గతంగా ఏదన్నా స్కెచ్ వేశారా ? టీడీపీతో పొత్తుంటే వైసీపీకి ఒక్కసీటులో గెలిచే అవకాశం కూడా ఉండదని పవన్ కు ఏమైనా రిపోర్టు అందిందా ? ఆ సర్వే రిపోర్టును చూసుకునే పవన్ రెచ్చిపోతున్నారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. జగన్ ఏమో 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీనే గెలవాలని అంటున్నారంటే రాష్ట్రం మొత్తాన్ని యూనిట్ గా తీసుకున్నారు.
ఇదే సమయంలో పవన్ కేవలం 34 సీట్లనే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి కేవలం ఉభయగోదావరి నియోజకవర్గాలపైన మాత్రమే దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. జగన్ టార్గెట్ కారణంగా చంద్రబాబునాయుడు కూడా టీడీపీ 175 సీట్లలో గెలవాలని ఏదో మాటవరసకు అంటున్నారని తెలిసిపోతోంది. సో, ఏ కోణంలో చూసినా జగన్, పవన్ టార్గెట్లు రీచయ్యేది అనుమానంగానే అనిపిస్తోంది. కాకపోతే పార్టీలో జోష్ నింపేందుకు అధినేతలు ఏదో మాట్లాడుతుంటారని సరిపెట్టుకోవాల్సిందే.