ఇంతకుముందు చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఏలకు క్లాసులు తీసుకోవటం మొదలుపెట్టారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమం పనితీరుపై ఈమధ్యనే సమీక్షించిన విషయం తెలిసిందే. ఆ సమీక్షలో మంత్రులు, ఎంఎల్ఏలు పాల్గొన్నారు. అందరి పనితీరు వివరించిన జగన్ 18 మంది ఎంఎల్ఏల పనితీరుమాత్రం ఏమాత్రం బాగాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. వాళ్ళ పేర్లు చెప్పటం బావోదని తొందరలోనే నేరుగా పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడుతానని చెప్పారు. చెప్పినట్లుగానే మొదటివిడతలో ఐదుమంది ఎంఎల్ఏలను పిలిపించుకున్నారు.
పోలవరం ఎంఎల్ఏ బాలరాజు, జగ్గంపేట ఎంఎల్ జ్యోతుల చంటిబాబు, జగ్గయ్యపేట ఎంఎల్ఏ సామినేని ఉదయభాను, పొన్నూరు ఎంఎల్ఏ కిలారు రోశయ్య, నెల్లూరు సిటి ఎంఎల్ఏ అనీల్ కుమార్ యాదవ్ ను పిలిపించుకుని ఫుల్లుగా క్లాసుపీకినట్లు సమాచారం. పార్టీలో ఉండాలని అనుకుంటున్నారా ? వచ్చేఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని సూటిగానే ప్రశ్నించారట. పార్టీ నేతలు, క్యాడర్ తో ఉన్న సమస్యలు, ఎంఎల్ఏల ఒంటెత్తు ప్రవర్తన, జనాల్లో ఎందుకు తిరగటంలేదు అంటు నిలదీశారట.
గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో తిరగకపోయినా, పాజిటివ్ రిపోర్టు లేకపోయినా రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదిలేదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పట్టించుకోవటంలేదని నిలదీశారట. వచ్చేఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశ్యంలేకపోతే చెప్పమని గట్టిగా వాయించేశారట. దాంతో ఇకనుండి జాగ్రత్తగా ఉంటమని, జనాల్లో తిరుగుతామని సమాధానం చెప్పినట్లు పార్టీవర్గాల టాక్. ఇదే ఫైనల్ వార్నింగని ఇకముందు పిలిపించుకుని మాట్లాడేదిలేదని కూడా స్పష్టంగా చెప్పేశారట.
తాజాగా తీసుకున్న క్లాసు నేపధ్యంలో వీళ్ళపనితీరు ఎలా మెరుగుపరుచుకుంటారో చూడాల్సింది. వీళ్ళలాగే ఏలూరు ఎంఎల్ఏ ఆళ్ళనాని తదితరులున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. నిజానికి జగన్ కు అత్యంత విధేయులైన పై ఎంఎల్ఏలు ఎందుకు ఇలా తయారయ్యారో అర్ధంకావటంలేదు. జగన్ కోసం ప్రాణాలిస్తామని ప్రకటించేవాళ్ళు జగన్ చెప్పిన కార్యక్రమాల్లో మాత్రం ఎందుకు పాల్గొనటంలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి ఐదుగురు ఎంఎల్ఏలకు జగన్ ఫుల్లుగా క్లాసుపీకారనే విషయంపై పార్టీలో పెద్దఎత్తున చర్చజరుగుతోంది. మరి మిగిలిన 13 మంది ఎంఎల్ఏలను ఎప్పుడు పిలిపిచుకుంటారు ? ఎప్పుడు క్లాసులు పీకుతారో చూడాల్సిందే.