వచ్చేనెల తెలుగుదేశంపార్టీకి చాల కీలకమైపోయింది. ఎందుకంటే రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణంపై ఫైనల్ విచారణ ఆగస్టు 10వ తేదీన ముగించబోతున్నట్లు హైకోర్టు చెప్పింది. రాజధాని ప్రాంతంలో అమరావతి నిర్మాణం పేరుతో వేలాది ఎకరాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం భూములు సమీకరించింది. ఇందులో సుమారు 1200 ఎకరాల అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. అసైన్డ్ భూముల చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములను కొనకూడదు, అమ్మకూడదు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా కొంటే కొనుక్కున్న వాళ్ళదే తప్పు.





అయితే ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన 1200 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సమీకరించలేదు. ప్రభుత్వం పేరుచెప్పి తమ్ముళ్ళే కొనేసుకున్నారు. అసైన్డ్ భూములను ప్రభుత్వానికి ఇచ్చి కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లను చాలావరకు తమ్ముళ్ళే సొంతంచేసుకున్నారు. అప్పట్లో దీనిపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కుంభకోణంపై ముందు సిట్ తర్వాత సీఐడీ విచారణ జరిపింది.  ఆధారాలున్నాయని చెప్పి చంద్రబాబునాయుడు, నారాయణ తదితరులపై సీఐడీ కేసులు నమోదుచేసింది.





కుంభకోణం జరిగింది వాస్తవమే అని తేల్చింది. అసైన్డ్ భూములు ఎక్కువగా అప్పటి మంత్రి నారాయణ నాయకత్వంలో టీడీపీలోని చాలామంది కీలకమైన నేతలు సొంతం చేసుకున్నారు. వాళ్ళందిరిపైనా సీఐడీ కేసులు పెట్టింది. ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారు, ఎవరిపేరుతో రిజిస్టర్ చేయించారనే విషయాలను సీఐడీ కోర్టుకు సబ్మిట్ చేసింది. దీనిపై చాలాకాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఏదో ఒకసాకుతో టీడీపీ నేతలు కేసు విచారణను అడ్డుకుంటున్నారు.





గురువారం కూడా ఇదే జరిగింది. తమ లాయర్ సిద్ధార్ధ లూథ్రా లేరు కాబట్టి వాయిదా వేయాలని నారాయణ తరపు జూనియర్ లాయర్ అడిగారు. దాంతో కోర్టు మండిపోయింది. ఎంతకాలమని సిద్ధార్ధ అందుబాటులో లేరని వాయిదాలు తీసుకుంటారంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఐడీ తరపు అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదిస్తు లాయర్ అందుబాటులో లేరన్న కారణంతోనే చాలా వాయిదాలు తీసుకున్నారని గుర్తుచేశారు. దాంతో ఇక వాయిదాలు కుదరదని ఫైనల్ విచారణ ఆగస్టు 10వ తేదీ జరుగుతుందని చెప్పి వాయిదావేశారు. మరి ఆగస్టు విచారణలో కోర్టు ఏమి చెబుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: