ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉన్నాం..ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అందరు సిద్ధంగా ఉండాలి..ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి 175 175 సీట్లు ఖాయం..ఇవి చంద్రబాబునాయుడు తరచూ చేస్తున్న ప్రకటనలు. చంద్రబాబు ప్రకటనలు నిజమేనా ? నిజంగానే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా అని చూద్దాం. జిల్లాల వారీగా పార్టీ లెక్కలను చూస్తే చంద్రబాబు ప్రకటనలోని డొల్లతనం బయటపడిపోతుంది. ఎన్నికలను రెండురకాలుగా చూడాలి. మొదటిదేమో అసెంబ్లీ ఎన్నికలు, రెండోదేమో పార్లమెంటు ఎన్నికలు.





ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, షెడ్యూల్ ఎన్నికలు జరిగినా టీడీపీకి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే టీడీపీ గెలుపుకు  పొత్తులే పెద్ద ప్రతిబంధకంగా మారబోతోంది. అసెంబ్లీలో 175 సీట్లకు గట్టి అభ్యర్ధులు లేరని అందరికీ తెలిసిందే. దీనికి అదనంగా పొత్తుల సమస్య ఉండనే ఉంది. పొత్తులో ఎన్నిసీట్లు వదులుకోవాలో తెలీదు, పోటీ అవకాశం కోల్పోయే తమ్ముళ్ళని ఎలా సముదాయిస్తారో తెలీదు. త్యాగరాజులందరు మిత్రపక్షం అభ్యర్ధుల విజయానికి కృషిచేస్తారో లేదో తెలీదు.





ఇది ఒకఎత్తయితే పార్లమెంటు సీట్లు మరోఎత్తు. 25 పార్లమెంటు సీట్లలో టీడీపీ తరపున పోటీచేసే గట్టి అభ్యర్ధుల పేర్లు చెప్పమంటే బహుశా చంద్రబాబు కూడా చెప్పలేరేమో. ఎందుకంటే పార్లమెంటుకు పోటీచేయాలని అనుకునే తమ్ముళ్ళు చాలా తక్కువమంది.  శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వచ్చేఎన్నికల్లో నర్సంపేట అసెంబ్లీకి పోటీచేయటానికి రెడీ అవుతున్నారు. ఎంపీగా పోటీచేయాల్సిందే అని చంద్రబాబు చెప్పినా కుదరదని చెప్పేశారట.





రామ్మోహన్ పోటీచేయకపోతే గట్టి ప్రత్యామ్నాయం లేరు. విజయనగరంలో పోటీకి ఎవరు ఇష్టపడటంలేదు. చివరకు అశోక్ గజపతిరాజు కూడా అసెంబ్లీకి మాత్రమే పోటీచేస్తానని చెప్పేశారు. ఇక అరకు, అనకాపల్లిలో అభ్యర్ధులే లేరు. వైజాగ్ లో పోటీకి భరత్ రెడీ అంటున్నారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో పోటీచేయటానికి తమ్ముళ్ళు ఆసక్తి చూపటంలేదు. ఏలూరులో మాజీ ఎంపీ మాగంటి బాబు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఈయన కాకపోతే పోటీచేసేది ఎవరో తెలీటంలేదు. నరసాపురంలో పోటీకి గట్టి తమ్ముడే లేరు.





మచిలీపట్నంలో కొనకళ్ళ నారాయణ పోటీచేయచ్చు. విజయవాడలో అయోమయంగా ఉంది. కేశినేని పోటీచేస్తారో లేదో తెలీదు. కేశినేని రెడీగా ఉన్నా చంద్రబాబు టికెట్ ఇచ్చేది అనుమానమే. సిట్టింగ్ ఎంపీ కాకపోతే ఆయన తమ్ముడు కేశినేని చిన్నానే క్యాండిడేట్ అంటున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పోటీకి దూరమని చంద్రబాబుకే చెప్పేశారు. ఇక్కడ గట్టి అభ్యర్ధిలేరు. నరసరావుపేటలో పుట్టా మహేష్ యాదవ్ పోటీచేయచ్చు.





ఒంగోలులో ప్రతి ఎన్నికకు ఒకళ్ళని పోటీలోకి దింపుతున్నారు. కాబట్టి వచ్చేఎన్నికల్లో ఎవరు పోటీచేస్తారో చూడాలి. నెల్లూరులో గట్టి అభ్యర్ధిని వెతుక్కోవాల్సిందే. రాయలసీమ మొత్తంమీద అంటే అనంతపురం, హిందుపురం, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతిలో గట్టి అభ్యర్ధులే లేరు. ప్రతి నియోజకవర్గంలోను ఎవరో ఒకళ్ళకి బీఫారం ఇచ్చి పోటీచేయించటానికి ఇబ్బందైతే లేదు. కానీ గట్టి అభ్యర్ధులేనా అంటే చెప్పటం కష్టమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: