ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన సందర్భంలో దగ్గుబాటి పురందేశ్వరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. రెండు రోజులు కూడా తిరగకుండానే ఇబ్బందులో పడేశారు. ఇంకా అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు కూడా తీసుకోలేదు. అప్పుడే ఆమెను వివాదంలో ఇరికించేశారు. 13వ తేదీన బాధ్యతలు తీసుకోబోతున్న పురందేశ్వరికి అతిపెద్ద వివాదం స్వాగతం చెప్పేందుకు రెడీగా ఉంది. వాలంటీర్ల ద్వారానే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందనే అతిపెద్ద ఆరోపణకు పురందేశ్వరి కూడా సమాధానం చెప్పుకోవాలిపుడు.
ఆరోపించింది పవన్ అయితే సమాధానం పురందేశ్వరి ఎందుకు చెప్పుకోవాలి ? ఎందుకంటే ఆమె ఇఫుడు బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు కాబట్టి. కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న అధ్యక్షురాలు కాబట్టే. అన్నింటికన్నా మించి జనసేనకు బీజేపీ మిత్రపక్షం అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. మిత్రపక్షాల్లో ఒక పార్టీ ప్రభావం మరో పార్టీపైన పడటం చాలా సహజమే కదా. పవన్ నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన అంశంపై రాష్ట్రంలో రెండురోజులుగా వివాదం రేగుతోంది.
ఈ విషయమై ఇఫ్పటికే ఆమె హోంశాఖతో పాటు పార్టీలోని సీనియర్లతో మాట్లాడే ఉంటారనటంలో సందేహంలేదు. అయితే అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ మీటింగులో కూడా చర్చకు వస్తుంది. ఆ తర్వాత మీడియా సమావేశంలో కచ్చితంగా ఎవరో ఒకళ్ళు పవన్ ఆరోపణలగురించి ప్రస్తావిస్తారు. అప్పుడు ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడక తప్పదు. పవన్ చేసింది రాజకీయ ఆరోపణ కాదు. చాలా నిర్దిష్టమైన వాలంటీర్లతో ముడిపడిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణ.
తనపాటికి తాను చేసిన ఆరోపణకాదు కేంద్రంలోని నిఘావర్గాలు తనకు చెప్పాయని పవన్ అన్నారు. అంటే హ్యూమన్ ట్రాపికింగ్ గురించి పవన్ తో చెప్పిన కేంద్ర నిఘావర్గాలు మరి బీజేపీ నేతలకు ఎందుకు చెప్పలేదు ? పైగా పురందేశ్వరి జాతీయ మహిళా మోర్చాలో కీలకమైన పదవిలో ఉన్నారు కూడా. ఆమె సొంత రాష్ట్రంలో 30 వేలమంది ఆడవాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ లో మిస్సయితే ఆమెకు సమాచారం ఉండకుండానే ఉంటుందా ? మొత్తానికి పురందేశ్వరిని పవన్ ఇరకాటంలో పడేసినట్లే ఉన్నారు.