జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు పెద్ద షాక్ తగిలింది. ఒక మహిళా వాలంటీరు పవన్ పై విజయవాడ సిటీకోర్టులో పరువునష్టం దావా వేశారు. వారాహియాత్రలో పవన్ మాట్లాడుతు ఏపీలో పెద్దఎత్తున హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని అందుకు వాలంటీర్లే కారణమని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పవన్ లెక్కల ప్రకారం సుమారు 16 వేలమంది హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురయ్యారు.
పవన్ ఆరోపణలు ఏమంటే వాలంటీర్లు ఇల్లిల్లు తిరుగుతు మహిళల వివరాలు అందులోను ఒంటరి మహిళల వివరాలను సేకరించి అసాంఘీక శక్తులకు అందిస్తున్నారట. హ్యూమన్ ట్రాఫికింగ్ లో వైసీపీలోని కీలక వ్యక్తుల ప్రమేయం కూడా ఉందన్నారు. ఈ విషయాలను కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పి రాష్ట్రంలోని ప్రజలను, మహిళలను అప్రమత్తం చేయమని చెప్పినట్లు పవన్ చెప్పారు. వాలంటీర్లకు ఎవరు ఎలాంటి వివరాలను ఇవ్వద్దని చెప్పారు. వాలంటీర్లకు గనుక డేటాను అందిస్తే అది అసాంఘీక శక్తులచేతుల్లో పడే ప్రమాదం ఉందని పదేపదే ఆరోపించారు. దీనిపై వాలంటీర్లు నాలుగురోజులు ఆందోళనలు చేశారు.
అయితే తన ఆరోపణలను ఉపసంహరించుకోవాల్సిన పవన్ అవే ఆరోపణలను పదేపదే ప్రస్తావించారు. దాంతో వాలంటీర్లను జనాలు అనుమానాలుగా చూడటం, ఇళ్ళకు రావద్దని చెబుతున్నారట. అందుకనే తాను కోర్టులో పవన్ పై పరువునష్టం దావా వేసినట్లు సదరు మహిళా వాలంటీర్ చెప్పారు.
వాలంటీర్ తరపున లాయర్లు మాట్లాడుతు వాలంటీర్ వేసిన పరువునష్టం దావాను కోర్టు విచారణకు స్వీకరించినట్లు చెప్పారు. వాలంటీర్ స్టేట్మెంట్ ను రికార్డుచేసుకున్న తర్వాత పవన్ కు నోటీసులు వెళతాయన్నారు. అప్పుడు పవన్ కోర్టుకొచ్చి తన ఆరోపణలకు ఆధారాలను చూపాల్సుంటుందని చెప్పారు. కేంద్ర నిఘావర్గాలు తనకు సమాచారం చెప్పాయనేందుకు పవన్ ఆధారాలను చూపాలని లాయర్లు పేర్కొన్నారు. పవన్ ఆరోపణల్లో ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్ర ఉన్నట్లు లాయర్లు అనుమానిస్తున్నారు. మరి వాలంటీరు వేసిన కేసు తర్వాత పవన్ కు నోటీసులు ఎప్పుడు వెళతాయో, పవన్ ఏమి చేస్తారో చూడాలి.