తెలుగుదేశంపార్టీతో పొత్తుంటుందో లేదో తెలీదు కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తమ్ముళ్ళకి వరసబెట్టి షాకులిస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తెనాలిలో జనసేనే పోటీచేస్తుందని గెలిచి తీరాలని స్పష్టంగా చెప్పారు. అభ్యర్ధి ఎవరు అని ప్రత్యేకంగా ప్రకటించకపోయినా పార్టీ తరపున పోటీచేయబోది నాదెండ్ల మనోహరే అని అందరికీ తెలిసిందే. టీడీపీతో పొత్తున్నా లేకపోయినా తెనాలి నుండి పోటీచేయబోయేది మాత్రం నాదెండ్లే అనటంలో అందరికీ క్లారిటి ఉంది.





అయితే ఇదే సీటులో పోటీచేసేందుకు సీనియర్ తమ్ముడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ రెడీ అవుతున్నారు. టీడీపీ అభ్యర్ధిగా ఆలపాటి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరిలో చివరకు ఎవరు పోటీచేస్తారనేది ఆసక్తిగా మారింది. సరే ఈ సంగతి వదిలేస్తే పిఠాపురం, కొవ్వూరు, ముమ్మిడివరం, కాకినాడ, రాజమండ్రి రూరల్, భీమిలీ, పాయకరావుపేట, తిరుపతి లాంటి నియోజకవర్గాల్లో జనసేన నేతలు తామే పోటీచేయబోతున్నట్లు ప్రచారం కూడా చేసుకుంటున్నారు.





నిజానికి ఈ సీట్లన్నీ తెలుగుదేశంపార్టీ పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు, మాజీ ఎంఎల్ఏలు, సీనియర్లు కొందరు రాబోయే ఎన్నికల్లో తామే అభ్యర్ధులమన్నట్లుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. వీరిలో కొందరికి స్వయంగా చంద్రబాబే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకే నియోజకవర్గంలో ఒకవైపు టీడీపీ నేతలు మరోవైపు జనసేన నేతలు అభ్యర్ధుల హోదాలో ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో రెండు పార్టీల్లోని క్యాడర్ తో పాటు జనాల్లో కూడా కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది.





రెండుపార్టీలు పొత్తుపెట్టుకుంటున్నట్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒకరోజేమో పొత్తుండదన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోరోజేమో పొత్తులు లేకుండా విడివిడిగా పోటేసేంత ధైర్యం రెండుపార్టీలకు లేదని మరో ప్రచారం జరుగుతోంది. పొత్తులు లేకపోతే రెండుపార్టీలు ఓడిపోతాయన్న విషయాన్ని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ వివిధ సందర్భాల్లో అంగీకరించారు. మరి ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే అప్పుడు పై నియోజకవర్గాల్లో  ఎవరు పోటీచేస్తారనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది. ఇపుడు ప్రచారం చేసేసుకుంటున్న నేతలను రేపు విత్ డ్రా అవ్వమని చెబితే ఒప్పుకుంటారా ? మొత్తంమీద పొత్తుకు ముందే టీడీపీకి పవన్ షాకిస్తున్నట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: