అంగళ్ళు అల్లర్ల విషయమై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలియగానే ఎల్లోమీడియా రెచ్చిపోయింది. తనను ఏ1గా పోలీసులు కేసు నమోదుచేయగానే చంద్రబాబునాయుడు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆగ్రహం, ఎల్లోమీడియా రెచ్చిపోవటం చూస్తుంటేనే కేసు నమోదుపై ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది. చంద్రబాబుపై కేసు నమోదు విషయంలో ఎల్లోమీడియా చాలా ప్రశ్నలు అడిగింది కానీ అందులో రెండు మూడు చాలా కీలకం. పైగా వేసిన పశ్నల్లో, అల్లిన కథనంలో డొల్లతనం బయటపడింది. కథనం మొత్తంలో చంద్రబాబుది ఏమీ తప్పులేదని తేల్చేసేందుకు తాపత్రపడింది.
దాడులు చేసిందెవరు ? రక్తమోడేలా గాయాలపాలైందెవరని ఎల్లోమీడియా వేసిన ప్రశ్నకు గొడవలు జరిగిన మరుసటిరోజు ఎల్లోమీడియాలో ప్రింట్ అయిన ఫొటోలే సాక్ష్యం. ఆరోజు రక్తమోడుతున్న టీడీపీ కార్యకర్తలంలు కొన్ని ఫొటోలు అచ్చేసింది. నిజానికి వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు. కానీ పొరబాటున టీడీపీ కార్యకర్తలుగా అచ్చేసింది. ఇక దాడులు చేసిందెవరంటే కచ్చితంగా టీడీపీ నుండే మొదలైందని అర్ధమైపోయింది. ముందస్తు అనుమతులు తీసుకునే చంద్రబాబు ప్రయాణిస్తుంటే కాన్వాయ్ ను పోలీసులు, వైసీపీ శ్రేణులు అడ్డుకున్నట్లు రాయటం కూడా అబద్ధమే.
పోలీసుల నుండి అనుమతి తీసుకున్న రూటుమ్యాపులో చంద్రబాబు వెళ్ళుంటే అసలు గొడవలు జరిగేదే కాదు. పుంగనూరు బైపాస్ రోడ్డుమీదుగా చిత్తూరు వెళ్ళాల్సిన చంద్రబాబు టౌన్లోకి సడెన్ గా ఎందుకొచ్చారో ఎల్లోమీడియా ఎక్కడా చెప్పలేదు. టౌన్లోకి చంద్రబాబును ఎంటర్ కానీయకుండా పోలీసులు అడ్డుకున్నపుడే గొడవ మొదలైందని ఎల్లోమీడియా దాచిపెట్టింది.
పోలీసులు అడ్డుకున్నపుడు టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులకు మద్దతుగా వైసీపీ శ్రేణులు తోడవ్వటంతో గొడవ బాగా పెరిగిపోయింది. ఎల్లోమీడియా లెక్కప్రకారం టీడీపీ శ్రేణులకు రక్తగాయాలైతే మరి 20 మంది పోలీసులకు రక్తగాయాలు ఎలాగయ్యాయో ఎల్లోమీడియా చెప్పగలదా ? మూడు పోలీసులు వెహికల్స్ కు నిప్పుపెట్టిందెవరో ఎల్లోమీడియా ఎందుకు ప్రస్తావించలేదు. తన వాహనం మీద నిలబడి ‘తరమండి కొడుకులను,.కొట్టండి..మనమేంటో చూపించండి’ అని టీడీపీ నేతలు, కార్యకర్తలను మైకుల్లో రెచ్చగొట్టిందెవరో ఎల్లోమీడియా చెబితే బాగుండేది. వీడియోల సాక్ష్యంగా దొరికిన తర్వాతే చంద్రబాబుపైన పోలీసులు ఏ1 గా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. పోలీసులు ఎక్కడ అరెస్టుచేస్తారో అన్న భయంతోనే ఎల్లోమీడియా చంద్రబాబుకు మద్దతుగా రెచ్చిపోతోంది.