చాలామంది మంత్రులు లేదా శాసనసభ్యులు ఆవేశంలో తాము ఏమి మాట్లాడుతున్నామో కూడా చూసుకుంటున్నట్లు లేదు. ఉగాది పండుగ లోగా తెలుగుదేశంపార్టీ, జనసేనలు గల్లంతవుతాయని సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ జోస్యం చెప్పారు. అలా కాకపోతే తాను గుండుకొట్టించుకుంటానని బొత్స చెప్పటం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్ధలంలో మంత్రి గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పై వ్యాఖ్యలు చేశారు.





వచ్చేఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ, జనసేన గెలిస్తే గుండుకొట్టించుకుంటానని బొత్స అన్నారంటే ఏదోలే చాలెంజ్ చేశారని అనుకోవచ్చు. పై రెండుపార్టీలు ఓడిపోతాయన్న నమ్మకంతో మంత్రి చెప్పారని జనాలు సరిపెట్టుకుంటారు.  కానీ మంత్రి అలా అనలేదు. వచ్చే ఉగాదికి టీడీపీ, జనసేనలు గల్లంతవుతాయని చెప్పారు. ఉగాది పండుగనాటికి పై రెండుపార్టీలు ఎలా గల్లంతవుతాయి. షెడ్యూల్ ఎన్నికల్లో వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సుంది. అంటే ఎన్నికలు జరిగేనాటికే ఉగాది పండుగ అయిపోతుంది. ఉగాది పండగకు, షెడ్యూల్ ఎన్నికలకు ఎలాంటి సంబంధంలేదు. ఎన్నికలు జరిగితే కానీ అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో తెలీదు.





అలాంటపుడు ఉగాదికి రెండుపార్టీలు గల్లంతవుతాయని బొత్స చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. చెప్పిన మంత్రి అంతటి ఆగకుండా గల్లంతు కాకపోతే గుండు కొట్టించుకుంటానని బహిరంగంగా చాలెంజ్ చేయటమే విచిత్రంగా ఉంది. అంటే ఆవేశంలో నోటికొచ్చింది మాట్లాడేసినట్లు అర్ధమవుతోంది. రేపు ఉగాది నాటికి టీడీపీ, జనసేనలు గల్లంతవుతాయని బొత్స చెప్పటంలో లెక్కేమిటి ? ఈలోపే ఎన్నికలు జరిగిపోతాయని, మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని అర్ధమా ?





అదే నిజమైతే ఎన్నికలు జరగబోయే విషయాన్ని నేరుగానో లేకపోతే పరోక్షంగానో చెప్పవచ్చు. అంతేకానీ గుండుకొట్టించుకుంటానని ప్రకటించాల్సిన అవసరంలేదు. బొత్స ప్రకటన చూసిన తర్వాత మంత్రి గుండుకొట్టించుకోవటం ఖాయమనే సెటైర్లు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు బొత్సను గుండుకొట్టించుకోవటంపై ఒక ఆటాడుకుంటున్నారు. అందుకనే రాజకీయ నేతలు అందులోను సీనియర్లు మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నలుగురు గదిలో కూర్చుని మాట్లాడుకునేటపుడు సరదాగా ఏమన్నా మాట్లాడుకోవచ్చు. కానీ జనాలు పాల్గొన్న బహిరంగసభల్లో మాట్లాడేటపుడు నోటిని అదుపులో పెట్టుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని గ్రహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: