ముందు చంద్రబాబునాయుడు, ఇపుడు పవన్ కల్యాణ్ వరుసగా ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. చంద్రబాబు పదిరోజులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తే అందులో మూడురోజులు ఉత్తరాంధ్రలోనే ఉన్నారు. పవన్ అయితే వారాహియాత్ర పేరుతో పదిరోజులు ఉత్తరాంధ్రలోనే క్యాంపు వేస్తున్నారు. వీళ్ళిద్దరు వరుసగా ఎందుకింతగా ఉత్తరాంధ్రమీద దృష్టిపెట్టినట్లు ? ఎందుకంటే జగన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విశాఖపట్నంకు రాబోతున్నారు కాబట్టే. అమరావతి నుండి తన క్యాంపు ఆఫీసును సెప్టెంబర్లో వైజాగ్ కు మార్చేయబోతున్నట్లు గతంలోనే జగన్ చెప్పారు.
అంటే జగన్ చెప్పిన ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి విశాఖలోనే కూర్చోబోతున్నారు. మూడురాజధానుల వ్యవహారం న్యాయస్ధానం విచారణలో ఉంది. కాబట్టి అధికారికంగా మూడు రాజధానులను ఏర్పాటుచేయలేరు. అందుకని ముందు జగన్ ఒక్కళ్ళే వైజాగ్ కు వచ్చేయబోతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సీఎం కార్యాలయం ఉంటుంది. ముఖ్యమంత్రి ఉండే ప్రాంతాన్ని అనధికారికంగా రాజధానిగా వైసీపీ వాళ్ళు ప్రచారంచేస్తారు.
కాబట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి విశాఖపట్నంకు అనధికారికంగా రాజధాని హోదా వచ్చేస్తుంది. ఇది చంద్రబాబు, పవన్ కు ఏమాత్రం ఇష్టంలేదు. వీళ్ళ ఉద్దేశ్యంలో జగన్ అమరావతి దాటి వెళ్ళకూడదు. కానీ వైజాగ్ వచ్చేయబోతున్నారు. అందుకనే జగన్ విశాఖకు తరలే లోపు ఎంత వీలుంటే అంత జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీని గబ్బుపట్టించేయటమే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. అందుకనే పదేపదే జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇద్దరు ఒకేసారి ఉత్తరాంధ్రలో టూర్ చేస్తే ఉపయోగముండదని అనుకున్నారు.
అందుకనే ఒకళ్ళ తర్వాత మరొకళ్ళు పర్యటనలు పెట్టుకున్నారు. చంద్రబాబు మూడురోజుల పర్యటన ముగిసే చివరి రోజు పవన్ వారాహియాత్రను మొదలుపెట్టారు. షెడ్యూల్ ప్రకారం మరో 8 రోజులు పవన్ ఈ ప్రాంతంలోనే పర్యటించబోతున్నారు. ఎక్కడ పర్యటించినా, ఏమి మాట్లాడినా జగన్ను టార్గెట్ చేయటమే లక్ష్యం. అందుకనే 30 వేల మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగుకు గురయ్యారని అందులో ఎక్కువమంది ఆడవాళ్ళు, పిల్లలు ఉత్తరాంధ్ర వాళ్ళే అని పవన్ ఆరోపణలు మొదలుపెట్టేశారు. అంటే వీళ్ళిద్దరి ఉద్దేశ్యం ఏమిటంటే జగన్ వైజాగ్ వచ్చే సమయానికి జనాల్లో ఫుల్లుగా వ్యతిరేకత తీసుకురావటమే. మరి వీళ్ళ ప్లాన్ వర్కవుటవుతుందా ?