వైఎస్ షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు ముహూర్తం ఒకటే తరువాయి. మిగిలిన విషయాలన్నీ దాదాపు ఫైనల్ అయిపోయినట్లే అని సమాచారం. షర్మిల కాంగ్రెస్ లో చేరితో హోదా ఏమిటి ? ఎక్కడినుండి పోటీచేస్తారు ? అన్న విషయాలు మాత్రమే ఇంకా ఫైనల్ కాలేదని ఇది ఫైనల్ అయిపోతే విలీనానికి ముహూర్తం రెడీ అయినట్లే అని నాలుగురోజుల క్రితం అన్నారు. అయితే తాజాగా ఆ రెండుపాయింట్లు కూడా డిసైడ్ అయిపోయాయట.
షర్మిలను కర్నాటక నుండి రాజ్యసభకు పంపటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందట. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు కూడా అధిష్టానం సానుకూలంగా ఉందని పార్టీవర్గాలు చెప్పాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు షర్మిల కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే సీమాంధ్రకు చెందిన షర్మిలను తెలంగాణాలో పోటీచేయిస్తే కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నాయని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటినుండి చెబుతునే ఉన్నారు. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలని రేవంత్ మొదటినుండి సూచిస్తున్నారు. తెలంగాణాలో షర్మిల యాక్టివ్ అయితే దీన్ని కేసీయార్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశముందని రేవంత్ అండ్ కో పదేపదే ప్రస్తావిస్తున్నారు. వీళ్ళ వాదనతో పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిందట.
అందుకనే ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ బాధ్యతలిస్తే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదని అధిష్టానం చేసిన ప్రతిపాదనకు షర్మిల కూడా సానుకూలంగానే స్పందించారట. ఢిల్లీలో ఈ విషయాలన్నీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో షర్మిల ఖరారు చేసుకున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. అన్నీ సెట్టయిపోయింది కాబట్టి వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ముహూర్తం పెట్టుకోవటం ఒకటే మిగిలింది. ఫైనల్ గా ఒకసారి సోనియా, రాహుల్, ప్రియాంకగాంధిలతో షర్మిల భేటీ అయిన తర్వాత విలీనం ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. మరా ముహూర్తం ఎప్పుడొస్తుందో చూడాలి.