మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు వాదన చాలా విచిత్రంగా ఉంటోంది. మార్గదర్శిలో అవకతవకలు, అక్రమాలు, మోసాలు జరుగుతన్నాయని సీఐడీ ఆరోపిస్తోంది. మోసాలు, అక్రమాలకు ఆధారాలను కూడా చూపుతోంది. సరే దీన్ని గురించి రామోజీ ఎక్కడా మాట్లాడటంలేదు. సీఐడీ అధికారులు చూపిస్తున్న మోసాలన్నీ తప్పులే అసలు వాస్తవం ఇది అని ఎక్కడా రామోజీ చెప్పటంలేదు.
రామోజీ వాదనంతా కేవలం రెండేపాయింట్ల మీదే నడుస్తోంది. మొదటిదేమిటంటే మార్గదర్శి 60 ఏళ్ళుగా నడుస్తున్న వ్యాపారసంస్ధ. ఏ ఒక్క చందాదారుడి డబ్బులు ఎగ్గొట్టలేదు. విశ్వసనీయతకు, నమ్మకానికి మార్గదర్శి మారుపేరని మాత్రమే చెబుతున్నారు. రెండో పాయింట్ ఏమిటంటే ప్రభుత్వ వైఫల్యాలను ఈనాడులో ఎండగడుతుంటే ప్రభుత్వం తమపై కక్షసాధిపులకు దిగుతోందని నానా రచ్చచేస్తున్నారు. ఇక్కడే రామోజీ జనాలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఎలాగంటే అసలు మార్గదర్శికి ఈనాడు దినపత్రికకు ఏమిటి సంబంధం ? ఈనాడేమో వార్తలు అందించే దినపత్రిక. మార్గదర్శి ఏమో వ్యాపారసంస్ధ. రెండింటికి లింకు ఏమిటో అర్ధంకావటంలేదు. మార్గదర్శి మీద దాడులు, సోదాలు జరుగుతుంటే ఈనాడులో వార్తలు రాస్తున్నాం కాబట్టి మార్గదర్శిలో సోదాలు చేస్తున్నారని అడ్డుగోలుగా వాదిస్తున్నారు. ఈనాడులో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నారు కాబట్టి కక్షకట్టారంటే అప్పుడు దాడులు చేయాల్సింది ఈనాడు మీదే కానీ మార్గదర్శి మీద కాదు కదా. మార్గదర్శిలో మోసాలు, అక్రమాలు జరుగుతున్నాయనే దాడులు చేస్తున్నారు.
అంటే గ్రూపులోని ఏ సంస్ధ మీద దాడులు జరిగినా రామోజీ మాత్రం ఈనాడు మీద దాడనే గోలచేస్తారు. ఎందుకంటే మీడియాను అడ్డంపెట్టుకుని ఏమైనా చేయచ్చు అనేస్ధాయికి చేరుకున్నారు కాబట్టే. మీడియా అధిపతి హోదాలో తనకు ప్రత్యేకమైన చట్టం, న్యాయం, రాజ్యాంగం ఉన్నాయని రామోజీ అనుకుంటున్నారేమో. తమ గ్రూపు వ్యాపారాలు దాడులు, సోదాలు, విచారణ, అరెస్టులు తదితరాలకు అతీతమని బహుశా రామోజీ అనుకుంటున్నారేమో. దేశంలోని అందరికీ రాజ్యాంగం, చట్టం, న్యాయం ఒకటే అన్న విషయాన్ని రామోజీ ఒప్పుకోవటంలేదు. సమస్యంతా ఇక్కడే వస్తోంది. మరి రామోజీ ఎప్పటికి ఈ విషయాన్ని అంగీకరిస్తారో చూడాలి.