రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించటమే లక్ష్యంగా తెలుగుదేశంపార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు పెట్టుకున్నదగ్గర నుండి ఐక్య కార్యాచరణను నిర్ణయించటం కోసం రెండు సమావేశాలు పెట్టుకున్నాయి. గురువారం అమరావతి టీడీపీ ఆఫీసులో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రెండుపార్టీల నేతలు సమావేశమయ్యారు. ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పన కీలక అంశంగా చర్చలు జరిగాయి.
ఇదే కాకుండా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిన విధానాలు, ఓటరుజాబితాల్లో అవకతవకలు తదితరాలపైన పోరాటాలు చేయాల్సిన విధానాలపై చర్చించారు. అంతాబాగానే ఉంది కానీ మ్యానిఫెస్టో రూపకల్పన పైనే అనుమానంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబుకు అసలు మ్యానిఫెస్టో అంటేనే ఏమాత్రం గౌరవంలేదు. 2014 ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో ఇచ్చిన సుమారు 600 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా అమలుచేయలేదు. రైతు రుణమాపీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, అన్న క్యాంటిన్లు, డ్వాక్రా మహిళల రుణమాఫీ ఇలా ఏ హామీ తీసుకున్నా తుంగలో తొక్కేశారు.
హామీలివ్వటం, మ్యానిఫెస్టోను ప్రకటించటం చంద్రబాబుకు అధికారంలోకి రావటం కోసమే. ఒకసారి అధికారంలోకి వచ్చేస్తే ఇక మ్యానిఫెస్టోను పట్టించుకోరు, హామీలను అమలుచేయరు. ఈ రెండు విషయాలు ఇప్పటికి చాలాసార్లు జనాల అనుభంలోకి వచ్చిందే. అందుకనే 2019 ఎన్నికల్లో టీడీపీని జనాలు చిత్తుగా ఓడించింది. ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకే పేర్లు మార్చి తన పథకాలుగా మినీ మ్యానిఫెస్టోలో ఇప్పటికే ప్రకటించారు.
జనసేన కూడా విడిగా చాలా హామీలనే ప్రకటించింది. ఇపుడు రెండుపార్టీలు కలిపి విడివిడిగా ఇచ్చిన హామీలను ఒకటిచేసి ఉమ్మడి మ్యానిఫెస్టోగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయంతే. మినీ మ్యానిపెస్టోగా చంద్రబాబు రాజమండ్రి మహానాడులో ఆరు హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటినే టీడీపీ సూపర్ సిక్స్ గా ప్రచారం చేసుకుంటోంది. ఈ ఆరు హామీల్లో కొన్నింటిని 2014లోనే ప్రకటించి అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేసిన విషయం తెలిసిందే. మళ్ళీ వాటినే కొత్త హామీలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి హామీలు, మీటింగుల వల్ల ఏమిటి ఉపయోగమో తెలీటంలేదు.