రాజకీయాల్లో హత్యలుండవు అంతా ఆత్మహత్యలే అనే నానుడి ఉంది. ఈ నానుడి జనసేన పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తెలంగాణా ఎన్నికల్లో పోటీచేసే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన స్ధాయిని తానే తగ్గించేసుకున్నారు. ఎలాగంటే అప్పుడెప్పుడో పవన్ మాట్లాడుతు తెలంగాణా ఎన్నికల్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. అప్పట్లో పవన్ చేసిన ప్రకటన టీడీపీ నేతల్లో టెన్షన్ పెంచేసింది. ఎలాగంటే అసలు బలమేలేని తెలంగాణాలోనే జనసేన 32 సీట్లలో పోటీచేయబోతుంటే ఇక ఏపీలో ఎన్నిసీట్లు అడుగుతారో అని తమ్ముళ్ళు టెన్షన్ పడ్డారు.





పార్టీ పెట్టిన దగ్గర నుండి పవన్ రాజకీయమంతా ఏపీలోనే తిరుగుతోంది. కాబట్టి ఏపీలో జనసేన చాలా బలంగా ఉందని పవన్ అనుకుంటున్నారు. ఈ విషయాన్ని అనేక వేదికల మీద పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఏపీలో పవన్ ఎన్నిసీట్లు అడుగుతారో అని తమ్ముళ్ళు కలవరపడ్డారు. సీన్ కట్ చేస్తే ఇపుడు తమ్ముళ్ళు చాలా రిలాక్సయిపోయారు.





కారణం ఏమిటంటే తెలంగాణా ఎన్నికల్లో 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని ప్రకటించిన పవన్ ఇపుడు పోటీచేస్తున్నది 8 సీట్లలో మాత్రమే. అంటే చెప్పిన సీట్ల సంఖ్యతో పోల్చితే పోటీచేస్తున్నది నాలుగో వంతు సీట్లలోనే. అదికూడా ఇద్దరు అభ్యర్ధులు బీజేపీ నేతలే. ఇదే పద్దతిలో ఏపీలో కూడా అడిగే నియోజకవర్గాల సంఖ్యకు వాస్తవంగా పోటీచేయబోయే నియోజకవర్గాలకు సంబంధముండదని తమ్ముళ్ళు డిసైడ్ అయిపోయారు. కాకపోతే తెలంగాణాలో అంత దీనస్ధితిలో ఉండకపోయినా కొంచెం గౌరవప్రదమైన సీట్లిస్తే చాలని తమ్ముళ్ళు డిసైడ్ అయిపోయారు.





ఎందుకంటే ఏపీలో కూడా చాలా నియోజకవర్గాల్లో జనసేనకు బలమైన అభ్యర్ధులు లేరు. ఎక్కువ సీట్లు పట్టుబట్టి తీసుకున్నా చివరకు అభ్యర్ధులను టీడీపీనే ఇవ్వాల్సుంటుంది. అందుకని పవన్ ఎన్నిసీట్లు అడిగినా మహాయితే ఓ 15-20 సీట్లిస్తే ఎక్కువని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. కాకపోతే ఇచ్చే సీట్లలోనే టీడీపీ బలమైన నియోజకవర్గాలు తెనాలి, తిరుపతి, పిఠాపురం, భీమిలీ, భీమవరం, నర్సాపురం లాంటి కొన్నిసీట్లను వదులుకోవాల్సుంటుందని తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు. తెలంగాణాలో బీజేపీతో పొత్తులేకుండా ఒంటరిగా జనసేన 32 సీట్లలో పోటీచేసుంటే అప్పుడు ఏపీలో కూడా ఇబ్బంది వచ్చేదని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: