తెలుగుదేశంపార్టీ, జనసేనలు లాజిక్ మిస్సవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో దేనికదే పోటీచేస్తే రెండుపార్టీలకు ఓటమి తప్పదని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ నిర్ధారణకొచ్చారు. నిర్ధారణకు వచ్చారంటేనే జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో అర్ధమవుతోంది. అందుకనే రెండుపార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఈనెల 17వ తేదీనుండి రెండుపార్టీలు  ఉమ్మడిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేయాలని డిసైడ్ అయ్యాయి. ఇందుకు వీలుగా జిల్లాల స్ధాయిల్లో కూడా ఉమ్మడి సమన్వయ  కమిటీలను నియమించుకుంటున్నాయి.





కచ్చితంగా జగన్ను ఓడగొడతామని లోకేష్, పవన్ తొడలు కొడుతున్నారు. ఇదంతా ఓకేనే జగన్ పైన రాజకీయ ఆరోపణలు చేస్తున్న పార్టీలు తమను జనాలు ఎందుకు ఎన్నుకోవాలో మాత్రం చెప్పలేకపోతున్నాయి. పాలనలో జగన్ చేసిన తప్పులివి, జరిగిన అవినీతిది  కాబట్టి తమను ఎన్నుకోవాలని జనాలను చంద్రబాబునాయుడు, పవన్ చెప్పలేకపోతున్నారు. గడచిన ఏడాదిగా సుమారు 5 లక్షల వైసీపీ సైన్యం నిర్విరామంగా జనాల్లోనే తిరుగుతోంది. గడపగడపకు వైసీపీ, సామాజిక సాధికార బస్సుయాత్రలు, తాజాగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళుతోంది. వైసీపీకే ఎందుకు ఓట్లేయాలో మంత్రులు, నేతలు జనాలకు చెబుతున్నారు.





మరిదే స్ధాయిలో టీడీపీ, జనసేన జనాల్లో తిరగలేకపోయాయి. ఇపుడు ఉమ్మడి కార్యక్రమాలు  పెట్టుకున్నా ఎన్నికలకున్న వ్యవధి ఇక ఐదుమాసాలు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళటం కష్టమే. నాలుగున్నరేళ్ళ పాలనలో ప్రజలకు తాను ఏమి చేశానో జగన్ బహిరంగసభల్లో వివరిస్తున్నారు. అమలవుతున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జనాలకు వివరిస్తున్నారు. వైసీపీనే  జనాలు ఎందుకు మళ్ళీ ఎన్నుకోవాలో  వివరంగా చెబుతున్నారు. పథకాల లబ్దిదారులు కళ్ళముందే కనబడుతున్నారు. మొదలైన అభివృద్ధి కూడా జిల్లాల్లో కనబడుతునే ఉంది.





ఇదే సమయంలో తమకే ఎందుకు ఓట్లేయాలో చంద్రబాబు, పవన్ జనాలకు వివరించలేకపోతున్నారు. జగన్ను ఓడించాలని చెబుతున్నారే కానీ తమకు ఎందుకు ఓట్లేయాలో చెప్పలేకపోతున్నారు. తన పాలనలో మంచి జరిగిందని అనుకుంటేనే వైసీపీకి ఓట్లేసి గెలిపించమని జగన్ ధైర్యంగా జనాలతో చెబుతున్నారు. మరిదే పద్దతిలో చంద్రబాబు చెప్పగలరా ? చంద్రబాబు అనుభవాన్ని, పాలనను చూసి తమ కూటమిని గెలిపించమని పవన్ జనాలను అడగ్గలరా ? తమను ఎందుకు గెలిపించాలో చంద్రబాబు, పవన్ ఇద్దరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అందరి కళ్ళకు కనబడుతోంది కాబట్టే. మరింత చిన్న లాజిక్ ను మరచిపోయిన రెండుపార్టీలను జనాలు ఆదరిస్తారా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: