ఇప్పుడు టీడీపీతో కలిసి జనసేన సమన్వయ కమిటీలను ఏర్పాటుచేయటం వరకు ఓకే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండుపార్టీలు ఐక్యఉద్యమాలు చేయటం కూడా బాగానే ఉంటుంది. కానీ అసలైన సమస్య గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచించకుండానే ముందుకెళుతున్నట్లు పార్టీలోనే చర్చలు పెరిగిపోతున్నాయి. అసలైన సమస్య అంటే సీట్ల షేరింగ్ మాత్రమే. పొత్తులో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది ? పోటీచేసే నియోజకవర్గాలు ఏవి ? అన్న విషయాలపై క్లారిటి తీసుకోకుండా ముందుకు అడుగులు వేయటం ఇబ్బందిగా ఉందని జనసైనికులంటున్నారు.
రెండు పార్టీలు పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. తెనాలి, భీమిలీ, పిఠాపురం, పీ గన్నవరం, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి, బద్వేలు, కడప, రాజంపేట, విశాఖపట్నం ఉత్తరం, పెందుర్తి, విజయవాడ సెంట్రల్, కాకినాడ, రాజమండ్రి లాంటివి కీలకమైనవి. ఒకవైపు సమన్వయ కమిటీలు వేసుకున్నా రెండుపార్టీల నేతలు విడివిడిగానే చాలా నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా వర్కవుట్ చేసుకుంటున్నారు.
రేపు సీట్ల షేరింగ్ లో ఏదో పార్టీకి దెబ్బపడక తప్పదు. అప్పుడు పోటీచేస్తున్న పార్టీకి రెండోపార్టీ నేతల నుండి ఎంతవరకు సహకారం దక్కుతుందన్నది అనుమానమే. అందుబాటులోని సమాచారం ప్రకారమైతే జనసేనకే ఎక్కువ దెబ్బపడే అవకాశముంది. ఎలాగంటే జనసేనకు చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు కూడా లేరు. ఒకవైపు చంద్రబాబునాయుడు, లోకేష్ చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు. ఇదే సమయంలో పవన్ కూడా చాలామంది నేతలకు హామీలిచ్చారు. దాని ప్రకారమే రెండుపార్టీల్లోని నేతలు నియోజకవర్గాల్లో ఎవరికి వాళ్ళుగా పనిచేసుకుంటున్నారు.
రేపటి ఎన్నికల్లో పవన్ ఇచ్చిన హామీ అమలయ్యే అవకాశంలేదని తేలితే పార్టీ నేతలతో ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది. అలాగే కొన్నిచోట్ల టీడీపీ నేతల నుండి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకనే ముందుగా సీట్లసంఖ్య, నియోజకవర్గాలు ఏవో తేలకుండానే ఉమ్మడి మ్యానిఫెస్టో, ఐక్య ఉద్యమాలు, సమన్వయ కమిటీల సమావేశాలంటే మాత్రం పవన్ కు ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది. అసలు చంద్రబాబు-పవన్ మధ్య ఈ విషయాలన్ని ఫైనల్ అయిపోయాయేమో కూడా తెలీదు. ఈ పాటికే ఫైనల్ అయిపోయినా చివరి నిముషంలో బయటపెట్టినపుడు పవన్ కు ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.