బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీద మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు అనేకమంది నేతలు పదేపదే ప్రతిరోజు మాటలతో దాడులు చేస్తునే ఉన్నారు. గతంలో ఎప్పుడూ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వారిపై అధికారపార్టీ నుండి ఇంతస్ధాయిలో మాటల దాడి జరగలేదు. పురందేశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రమే పరిస్ధితి ఎందుకిలా మారింది ? ఎందుకంటే ముందుగా పురందేశ్వరి నుండే ప్రభుత్వంపై దాడులు మొదలయ్యాయనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని అధ్యక్షురాలు టార్గెట్ చేసుకున్నారు.
మొదట్లో జగన్ పైన అప్పుల విషయంలో పురందేశ్వరి ఆరోపణలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆమె పదేపదే ఆరోపణలను రిపీట్ చేయటం, కేంద్రమంత్రులను కలిసి పిర్యాదులు చేయటంతో మంత్రులు, విజయసాయి అలర్టయ్యారు. ఆమె ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని అర్ధంచేసుకున్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అచ్చంగా చంద్రబాబునాయుడు, తమ్ముళ్ళు చేస్తున్న ఆరోపణలు, ఎల్లోమీడియా కథనాల్లాగే ఉన్నాయని అర్ధమైపోయింది.
అందుకనే పురందేశ్వరి విషయాన్ని జగన్ తో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ దొరకగానే ముందు విజయసాయి ఎదురుదాడి మొదలుపెట్టారు. బహుశా జగన్ కూడా బీజేపీలోని ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఎదురుదాడి చేయటానికి పార్టీ వాళ్ళకి అనుమతి ఇచ్చుంటారని పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే అనుమతి దొరికిందో అప్పటినుండే ఎదురుదాడులు మొదలైపోయాయి. విజయసాయికి మద్దతుగా మంత్రులు రోజా, సీదిరి అప్పలరాజు, బొత్సా, అంబటి పూర్తిస్ధాయిలో అఫెన్స్ లోకి దిగేశారు. అందుకనే ప్రతిరోజు పురందేశ్వరికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా వేదికగా పదేపదే దాడులు చేస్తున్నారు.
కాకపోతే మొత్తం ఎపిసోడ్లో గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే పార్టీలో పురందేశ్వరి ఒంటరైపోయారు. ప్రభుత్వం మీద టీడీపీ కోసమే పదేపదే అధ్యక్షురాలు ఆరోపణలు చేస్తున్నారనే అనుమానాలు పార్టీలో కూడా పెరిగిపోతున్నాయి. అందుకనే పురందేశ్వరికి మద్దతుగా పార్టీలో పెద్దగా మద్దతు దొరకటంలేదు. జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత తొందరలోనే కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.