స్కిల్ స్కామ్ లో 53 రోజుల రిమాండు అనుభవించి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు తన వ్యూహాన్ని మార్చుకున్నట్లే కనబడుతోంది. అయితే తాజా వ్యూహంలో తనకు సూట్ కాని మాటలను చాలా మాట్లాడుతున్నారు. తాజాగా విజయవాడలోని కనకదుర్గమ్మను భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాటలే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే తన జీవితం ప్రజాసేవకే అంకితమట.
ధర్మ సంస్ధాపన, న్యాయపరిరక్షణ జరగాలన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగాలి, దుష్ట శిక్షణ చేయాలన్నారు. ఆదివారం సింహాచలం, 5న శ్రీశైలం క్షేత్రాలను దర్శిస్తానని చెప్పారు. ఆ తర్వాత తన కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ధర్మ సంస్ధాపన, న్యాయపరిరక్షణ, దుష్ట శిక్షణ, జీవితం ప్రజాసేవకే అంకితం లాంటి మాటలు చంద్రబాబుకు అస్సలు సూట్ కావు. అధికారంలో ఉంటే చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు, మీడియా లాంటి వాటిని దేన్నీ చంద్రబాబు పట్టించుకోరని అందరికీ తెలిసిందే.
ఖర్మంజాలక ప్రతిపక్షంలోకి రాగానే ప్రతిరోజు చట్టం, న్యాయం, విలువలు, ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు, మీడియా స్వేచ్చ లాంటి మాటలు చాలా మాట్లాడుతారు. వాటికి అదనంగా ధర్మ సంస్ధాపన, న్యాయపరిరక్షణ, దుష్టశిక్షణ లాంటి పదాలను చేర్చారు. ప్రతిపక్షంలో ఉండికూడా దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నియంత్రించాలని చాలా ప్రయత్నాలు చేసారు. అందుకు కోర్టులను ఎంతగా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. దేశంలోని మరే రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు కానన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్) జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలయ్యాయి. కొన్ని వందల పిల్స్ దాఖలయ్యాయంటే అందులో అత్యధికం చంద్రబాబు పుణ్యమనే చెప్పాలి.
తనను ఓడించిన జగన్ను ఎంత వీలైతే అంతగా చంద్రబాబు ఇబ్బందులు పెట్టారు. అందుకు కోర్టులను మద్దతుగా వాడుకున్నారు. అయితే కాలం ఎదురుతిరిగి చివరకు చంద్రబాబు మీదే అవినీతి కేసులు నమోదై ఒకదానిలో రిమాండు అనుభవించాల్సొచ్చింది. చంద్రబాబు కూడా అత్యంత అవినీతిపరుడే అన్న విషయం జనాలకు బాగా తెలిసొచ్చింది. దాంతో ఒక్కసారిగా రూటు మార్చేసి న్యాయం, ధర్మం, దుష్టశిక్షణ లాంటి మాటలు మాట్లాడుతున్నారు.