వచ్చేఎన్నికల ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర  నుండే మొదలుపెట్టబోతున్నారా ? అందులో కూడా రుషికొండ ప్రాంతానే ఎంచుకున్నారా ? అంటే అవుననే పార్టీవర్గాలు చెబుతున్నాయి. పలానా నియోజకవర్గం నుండి ప్రచారాన్ని మొదలుపెట్టాలనే సెంటిమెంటు జగన్ కు ఉన్నట్లు లేదు. కాకపోతే ప్రచారం మొదలుపెట్టేముందు, ప్రచారం ముగించిన వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నది మాత్రం వాస్తవం. ప్రతిపక్షంలో ఉన్నపుడు పాదయాత్ర మొదలుపెట్టేముందు కూడా జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్ర ముగిసిన వెంటనే ఇచ్చాపురం నుండి డైరెక్టుగా తిరుమలకే చేరుకున్నారు.





ఆ తర్వాత ఎన్నికల ప్రచారం, ముగింపు కూడా అలాగే చేశారు. అయితే రాబోయే ఎన్నికల ప్రచారాన్ని మాత్రం రుషికొండ నుండి ప్రారంభించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రుషికొండ ఏరియా భీమిలీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కాబట్టి వచ్చేఎన్నికల ప్రచారాన్ని జగన్ భీమిలీ నియోజకవర్గం నుండి మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తు ప్రకారం రుషికొండ జగన్ కు బాగా కలిసివస్తుందని  పీఠాధిపతులు చెప్పారట. అందుకనే జగన్ ప్రత్యేకంగా రుషికొండను ఎంచుకున్నట్లు సమాచారం.





ఈనెల 8వ తేదీ తర్వాత జగన్ రెగ్యులర్ గా విశాఖపట్నంలో క్యాంపు వేయటం ఖాయంగా కనిపిస్తోంది. రాజధాని అనికాకుండా క్యాంపాపీసు అని మాత్రమే ప్రస్తుతానికి వైజాగ్ ను వాడుకోబోతున్నారు. కోర్టు వివాదాలు సెటిల్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంకు పూర్తిస్ధాయి రాజధాని హోదాను ప్రకటించాలన్నది జగన్ ఆలోచన. సుప్రింకోర్టులో మూడు రాజధానుల కేసులు ఎప్పుడు సెటిల్ అవుతాయో తెలీదు కాబట్టే ఈలోగా క్యాంపాపీసును రుషికొండమీద ఏర్పాటు చేసుకున్నారు.





ఎలాగూ ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఉత్తరాంధ్రలో పట్టు నిలుపుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే వైజాగ్ ను బేస్ చేసుకోబోతున్నారు. రుషికొండలో ఏర్పాటు చేసుకున్న  క్యాంపాపీసులోకి మారటానికి ఇప్పటికే చాలా ముహూర్తాలు మారాయి. మరిపుడు డిసెంబర్  8వ తర్వాత ఏ రోజైనా జగన్ రుషికొండ నుండే సమీక్షలు చేయబోతున్నారనే ప్రచారం  మొదలైంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: