ప్రకాశం జిల్లా నేతలతో చంద్రబాబునాయుడు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లిస్తానని ప్రకటించారు. రాష్ట్రప్రజలకు తెలుగుదేశంపార్టీ అవసరం చాలా ఉందన్నారు. అందుకని వచ్చేఎన్నికల్లో పార్టీ గెలిచి తీరాలన్నారు. అంతర్గత సర్వేల్లో గెలుస్తారని కచ్చితంగా రిపోర్టు వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. టికెట్లు ఇవ్వదలచుకోని వాళ్ళకి ప్రత్యామ్నాయ చూపిస్తానని హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు మాటలు, వార్నింగులు విన్న తర్వాత తమ్ముళ్ళల్లో చాలా సందేహాలు మొదలయ్యాయి.
అసలు గెలుపుగుర్రాలు అని ఎలా ఫైనల్ చేస్తారని తమ్ముళ్ళు అడుగుతున్నారు. ప్రతి ఎన్నికకు ముందు అభ్యర్ధుల ఎంపికపై సర్వేలు చేయించుకోవటం చంద్రబాబు అలవాటే. అయితే ఎన్నికల్లో పోటీచేసిన వారిలో చాలామంది ఓడిపోతుంటారు. 2019 ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగిందని తమ్ముళ్ళు గుర్తుచేస్తున్నారు. పైగా రాబోయే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యూత్ కే కేటాయించబోతున్నట్లు చాలాసార్లు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లో 40 శాతం టికెట్లంటే 70 సీట్లు.
మరీ 70 సీట్లలో యూత్ అంటే కొత్తవారికి టికెట్లిస్తారా ? లేకపోతే సీనియర్ల వారసులకే టికెట్లిస్తారా అన్నది చంద్రబాబు ఇప్పటివరకు తేల్చలేదు. సీనియర్లకే టికెట్లిచ్చేట్లయితే వీళ్ళల్లో ఎంతమంది గెలుస్తారో తెలీదు. సీనియర్లను కాదని కొత్తవారికి అందులోను యూత్ కు టికెట్లిస్తే గెలుపుకు ఎంతమంది సహకరిస్తారో తెలీదు. పైగా పొత్తులో జనసేనకు ఎన్నోకొన్ని సీట్లు కేటాయించక తప్పదు. అందులో మిత్రపక్షం ఎన్నిసీట్లు గెలుస్తుందో ఎవరు చెప్పలేరు. రాష్ట్రప్రజలకు టీడీపీ అవసరం ఎంతో ఉందని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. టీడీపీ అధికారంలోకి రావటం చంద్రబాబుకే ఎక్కువ అవసరం.
ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్ధితి తెలంగాణాలో లాగే తయారవుతుంది. అసలు మాటమీద నిలబడటం అన్నది చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటులేదు. పార్టీకోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని కాదని చివరినిముషంలో కొత్తవారికి టికెట్లు ఇచ్చిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. గెలుపు గుర్రాలని, సర్వేలని ఇపుడు చంద్రబాబు చెబుతున్న మాటలను చాలామంది తమ్ముళ్ళు నమ్మటంలేదు. చివరకు ఏమిచేస్తారో చూడాల్సిందే.