మంగళగిరి ఎంఎల్ఏగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా ఘటనను రెండు కోణాల్లో చూడవచ్చు. ఆళ్ళ కోణంలో చూస్తే పార్టీకి హెచ్చరికగా కనబడుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి కోణంలో చూస్తే అసంతృప్తులకు వార్నింగ్ లాగ కనబడుతుంది. అందుకనే ఆళ్ళ రాజీనామా ఎవరికి హెచ్చరిక అన్నదే చాలామందికి అర్ధంకావటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే మంగళగిరి ఎంఎల్ఏగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎంఎల్ఏ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు.
కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినపుడు జగన్ కు మద్దతుగా నిలబడిన ఎంఎల్ఏలు, నేతల్లో ఆళ్ళ కూడా ఒకళ్ళు. మంగళగిరి నుండి రెండోసారి ఎంఎల్ఏగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ కు అత్యంత నమ్మకస్తులు, స్ట్రాంగ్ సపోర్టర్లలో ఎంఎల్ఏ కూడా ఒకళ్ళని చెప్పాలి. అలాంటి ఆళ్ళ సడెన్ గా ఎంఎల్ఏ పదవితో పాటు పార్టీకి కూడా ఎందుకు రాజీనామా చేశారన్నదే ఆశ్చర్యంగా ఉంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రెండు కారణాలు కనబడుతున్నాయి. తన వ్యతిరేకులను జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆళ్ళ కోపంగా ఉన్నారన్నది మొదటి కారణం.
వచ్చేఎన్నికల్లో మంగళగిరి సీటును ఆళ్ళకు కాకుండా బీసీ ముఖ్యంగా చేనేత సామాజికవర్గానికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారట. చేనేతలకు చెందిన ఎంఎల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎంఎల్ఏ కోండ్రు కమల పోటీపడుతున్నారు. వీళ్ళలో గంజికి టికెట్ దక్కే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గం ఇన్చార్జిగా గంజినే ప్రకటించారు. టికెట్ ఇవ్వదలచుకోలేదు కాబట్టే జగన్ తనను పట్టించుకోవటంలేదని ఆళ్ళ భావించారనే ప్రచారం జరుగుతోంది. అయితే చాలా కాలం క్రితమే 2024 ఎన్నికల్లో తాను పోటీచేయటం లేదని స్వయంగా ఆళ్ళే చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆళ్ళ రాజీనామా జగన్ కోణంలో మిగిలిన వాళ్ళకు ఒక వార్నింగులాగ అనుకోవచ్చు. అత్యంత సన్నిహితుడైన ఆళ్ళకే జగన్ టికెట్ ఇవ్వదలచుకోలేదు అనే సంకేతాలు మిగిలిన వాళ్ళకి వెళతాయి. ఎందుకంటే పనితీరు బావోలేని సుమారు 30 మంది ఎంఎల్ఏలకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆళ్ళకే టికెట్ ఇవ్వనపుడు ఇక మనం ఎంత అని టికెట్ దక్కని ఎంఎల్ఏలు ఎవరికి వాళ్ళుగా ఏమిచేయాలో డిసైడ్ అవ్వాల్సిందే. తాజా రాజీనామాతో ఆళ్ళకి నష్టమా లేకపోతే పార్టీకి నష్టమా అన్నది భవిష్యత్తే తేల్చుతుంది.