ఉత్తరాంధ్రలో కీలకమైన గాజువాక నియోజకవర్గం ఇన్చార్జిగా వరికూటి రామచంద్రయాదవ్ నియామకం ఆశ్చర్యంగా ఉంది. పోయిన ఎన్నికల్లో ఇక్కడినుండి తిప్పల నాగిరెడ్డి గెలిచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నాగిరెడ్డి గెలవటంతో జెయింట్ కిల్లర్ గా పాపులరయ్యారు. తిప్పల వయోభారం కారణంగా ఆమధ్య ఆయన కొడుకు దేవాన్ రెడ్డిని జగన్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. పార్టీ కార్యక్రమాలను దేవానే చూసుకుంటున్నారు. అయితే సడెన్ గా ఇన్చార్జి పదవికి దేవాన్ రాజీనామా చేశారు.
ఆయన స్ధానంలో వరికూటి రామచంద్రరావు యాదవ్ ను నియమించారు. అయితే వరికూటి నియామకం ముందే దేవాన్ ఇన్చార్జిగా రాజీనామా చేశారు. ఎంఎల్ఏ పదవితో పాటు పార్టీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్దిసేపటికే దేవాన్ కూడా రాజీనామా చేయటంతో పార్టీలో సంచలనమైంది. ఆళ్ళ రాజీనామా చేశారంటే అర్ధముంది మరి దేవాన్ ఎందుకు రాజీనామా చేశారనే ప్రశ్న మొదలైంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం నాగిరెడ్డి మీద బాగా ఆరోపణలున్నాయట.
రాబోయే ఎన్నికల్లో నాగిరెడ్డికే టికెట్ ఇస్తే గెలుపు కష్టమనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందుకనే కొడుకు దేవాన్ ను ఇన్చార్జిగా నియమించారు. అయితే ఈమధ్య చేయించిన సర్వేలో తండ్రి, కొడుకులు ఒకటే కదానే అభిప్రాయాన్ని మెజారిటి జనాలు వ్యక్తంచేశారట. అందుకనే సీనియర్ నేతను ఇన్చార్జిగా నియమించాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని నాగిరెడ్డి, దేవాన్ తో మాట్లాడినపుడు జగన్ చెప్పేశారట. ఎంఎల్ఏ టికెట్ ఇచ్చేదిలేదని, ఇన్చార్జిగా కొత్తవాళ్ళని నియమిస్తామని చెప్పిన తర్వాత ఇక ఆ పదవిలో కంటిన్యు అవటం అనవసరమని దేవాన్ ఇన్చార్జిగా రాజీనామా చేసినట్లు సమాచారం.
అందుకనే దేవాన్ రాజీనామా చేసిన వెంటనే వరికూటిని జగన్ ఇన్చార్జిగా నియమించారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లు బాగా ఎక్కువగా ఉన్నాయట. ఉత్తరాంధ్రలో బీసీల ప్రాబల్యం చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే. అందుకనే దేవాన్ స్ధానంలో వరికూటిని నియమించింది. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం సామాజికవర్గాల ఆధారంగానే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు మరో నాలుగు నెలలుండగా జరుగుతున్న తాజా పరిణామాల్లో నియోజకవర్గాల ఇన్చార్జీలే ఎంఎల్ఏ అభ్యర్ధులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.