నియోజకవర్గాల విషయంలో జరుగుతున్న మార్పులపై జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి పార్టీలో మద్దతు పెరుగుతోంది. 11 నియోజకవర్గాలకు జగన్ ఇన్చార్జిలను మార్చిన విషయం తెలిసిందే. ఈ 11 మందిలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. మరి ఇపుడు మార్చిన వారందరికీ జగన్ రాబోయే ఎన్నికల్లో టికెట్లిస్తారా ? లేకపోతే పూర్తిగా పక్కనపెడతారా అన్నది చూడాలి. టికెట్లిచ్చినా ఇవ్వకపోయినా జగన్ తీసుకున్న నిర్ణయమైతే చాలా డేరింగ్ స్టెప్ అనే అనుకోవాలి.
తొందరలోనే మరో 30 నియోజకవర్గాల్లో కూడా మార్పులుంటాయని బాగా ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాలు మారుతున్న వాళ్ళ మనోగతం ఎలాగుందో తెలీదు కానీ పార్టీలో మాత్రం చాలామంది హ్యాపీగా ఫీలవుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కారణం ఏమిటంటే పనిచేయని ఎంఎల్ఏలకు మళ్ళీ టికెట్లు ఇవ్వకూడదని ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్, మద్దతుదారులు జగన్ కు సూచిస్తున్నారు. ఎన్నికలు నాలుగునెలల్లోనే ఉన్నాయి కాబట్టి మార్పులు చేయటానికి ఇదే సరైన సమయమని అంటున్నారు.
అలాగే మార్పులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించే తీసుకుంటారని నేతలు నమ్ముతున్నారు. అందుకనే ఇపుడు చేసిన, తొందరలో చేయబోతున్న నియోజకవర్గాల మార్పుపై జగన్ కు అందరు మద్దతుగా నిలబడాలని సోషల్ మీడియాలో పోస్టులు తెగ కనబడుతున్నాయి. కొందరు ఎంఎల్ఏల మీద పార్టీలోనే వ్యతిరేకత కనబడుతోంది. అలాంటి వారికి టికెట్లిచ్చేది లేదని, కాదు కూడదంటే నియోజకవర్గం మారాల్సిందే అని జగన్ చెబుతున్నదాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు.
అసలు జనాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగులకు మళ్ళీ టికెట్లు ఇవ్వకుండా కొత్తవాళ్ళని పోటీలోకి దింపమని జగన్ కు సోషల్ మీడియాలో సూచనలు అందుతున్నాయి. మార్పుల విషయంలో నేతలు, మద్దతుదారుల పోస్టులు చూస్తుంటే జగన్ నిర్ణయానికి బాగా మద్దతున్నట్లే అర్ధమవుతోంది. మద్దతుదారులు చెబుతున్నట్లు తొందరలోనే మిగిలిన మార్పులు కూడా చేసేస్తే ఇక ప్రచారానికి రెడీ అన్నట్లుగానే ఉంది వైసీపీలో పరిస్ధితి. మరి చివరకు ఎన్నికల్లో ఏమవుతుందో చూడాల్సిందే.