తెలంగాణాలో ప్రభుత్వం మారగానే ఏపీప్రత్యేకహోదాకు మద్దతు పెరుగుతోంది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అని తేల్చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కూడా కేసీయార్, కవిత ఒకటిరెండుసార్లు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని చెబుతునే తెలంగాణాకు కూడా కావాలని కవిత మెలిక పెట్టారు. అయితే తాజా కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి కోమటిరెడ్డి మాత్రం అలాంటి మెలికలేవీ పెట్టలేదు.





2014 విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను కోమటిరెడ్డి గుర్తుచేశారు. అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని తర్వాత ప్రధానమంత్రి అయిన నరేంద్రమోడీ పట్టించుకోకపోవటం చాలా దురదృష్టకరమన్నారు. ఇపుడు జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కోమటిరెడ్డి ఎందుకింత గట్టిగా మాట్లాడుతున్నట్లు ?





ఎందుకంటే ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని ఎన్నికల అంశంగా తీసుకోవాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి డిసైడ్ చేశారు కాబట్టే. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కీలకమైన హామీగా ప్రచారం చేయాలని ఇప్పటికే రాహుల్, ప్రియాంకలు ఏపీ నేతలకు చెప్పారు. మరి తెలంగాణాలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఏపీకి ప్రత్యేకహోదాకు మద్దతుగా మంత్రి మాట్లాడారు.





అయితే వీళ్ళంతా మరచిపోయిన విషయం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేకహోదా రాదని. ప్రత్యేకహోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏపీలో బీజేపీ పరిస్ధితిలో ఎలాంటి మార్పురాదు. అందుకనే ఏపీ ప్రయోజనాలను మోడీ మొదటినుండి తుంగలో తొక్కేస్తున్నది. 2024 ఎన్నికల్లో కేంద్రప్రభుత్వం ఏర్పాటులో ఎంపీల సంఖ్య తక్కువై అదికూడా ఏపీ ఎంపీల మద్దతు కీలకమైతే అప్పుడేమైనా ఏపీకి ప్రత్యేకహోదా గురించి మోడీ ఆలోచిస్తారేమో తెలీదు. మొత్తానికి సజావుగా అమలైపోవాల్సిన రాష్ట్ర విభజన చట్టం హామీలు రాజకీయాలకు బలైపోయి గబ్బుపట్టిపోయిందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: