జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ స్టార్ అనే పేరు స్ధిరపడిపోయింది. మామూలు జనాలు పవన్ గురించి మాట్లాడుకునేటపుడు ప్యాకేజీస్టార్ అనే మాట్లాడుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అండ్ కో అనే చెప్పాలి. చంద్రబాబునాయుడు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకునే రాజకీయాలు చేస్తున్నారనే విషయాన్ని జనాల్లో బలంగా ముద్రేశారు. జనాలు కూడా ప్యాకేజీ తీసుకునే పవన్ రాజకీయాలు చేస్తున్నారు అనుకునేందుకు తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణగా నిలిచింది.
అదేమిటంటే లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది. 226 రోజులు 97 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్రచేశారు. దాని ముగింపు సభను పోలేపల్లిలో భారీ బహిరంగసభతో ముగించాలని అనుకున్నారు. అందుకు చంద్రబాబునాయుడుతో పాటు పవన్ను కూడా ముఖ్య అతిధులుగా పిలిచారు. మొదట్లో బహిరంగసభకు వస్తానని పవన్ మాటిచ్చారు. తర్వాత ఏవో కారణాలు చెప్పి రావటంలేదన్నారు. బహిరంగసభకు పవన్ రావటంలేదని స్వయంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపుఅచ్చెన్నాయుడే చెప్పారు.
తర్వాత ఏమైందో ఏమో పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్ళారు. ఇద్దరి మధ్య దాదాపు రెండున్నర గంటలు చర్చలు జరిగాయి. చర్చల్లో ఏమి మాట్లాడుకున్నారో ఏమో తెలీదు కానీ బహిరంగసభకు పవన్ హాజరవుతున్నారు. ప్యాకేజీ కోసమే బహిరంగసభలో పాల్గొనేది లేదని పవన్ అలిగారంటు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. ప్యాకేజీ ముట్టగానే బహిరంగసభలో పవన్ పాల్గొనేందుకు అంగీకరించారనే సెటైర్లు పేలుతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే వ్యక్తిగత పనుల వల్లే పవన్ బహిరంగసభకు రావటంలేదని అచ్చెన్న ప్రకటించారు.
అచ్చెన్న ప్రకటన నిజమే అయితే 24 గంటల్లోనే వ్యక్తిగత పనులు, కారణాలు ఏమైపోయాయని పవన్ను నెటిజన్లు అడుగుతున్నారు. ముందు హాజరుకావటంలేదని చెప్పటం తర్వాత పవన్ ఇంటికి స్వయంగా చంద్రబాబు వెళ్ళటం ఆ మరుసటి రోజే బహిరంగసభలో పాల్గొనేందుకు పవన్ రెడీ అయిపోవటాన్ని నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు. ప్యాకేజీ ఇస్తున్నారా ? తీసుకుంటున్నారా అన్నది చంద్రబాబు, పవన్ కు మాత్రమే తెలియాలి. కానీ చాలా సందర్భాల్లో పవన్ వైఖరి కారణంగా ప్యాకేజీ ముడుతోందని జనాలు అనుకునేందుకు ఆస్కారం ఏర్పడుతోందన్నది మాత్రం వాస్తవం.