ఎన్నికల్లో పార్టీలను గెలిపించేది ప్రజలా.. వ్యూహకర్తలా ? దేశంలో ఇప్పుడు అయితే వ్యూహకర్తల సీజన్ నడుస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీలు, 40ఏళ్లు, చివరకి 10ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలు అన్నీ గెలుపు కోసం వ్యూహకర్తల వెంట పడుతున్నారు. ఒక వ్యూహకర్తను పెట్టుకుంటే చాలు అతనే మన పార్టీని గెలిపిస్తాడు అనే భావనలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఉన్నాయి.


ప్రశాంత్ కిశోర్, సునీల్ కనుగోలు, రాబిన్ శర్మ, రిషి రాజాసింగ్ ఇలా రకరకాల వ్యూహకర్తల పేర్లు వినిపిస్తున్నాయి.  వ్యూహకర్తలు చేసే పని ఏంటంటే శాస్త్రీయ ధృక్పథంతో ప్రచారం చేయడం, విభిన్నంగా పార్టీ ప్రచార శైలిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల నాడిని గుర్తించడం, అందుకు అనుగుణంగా మ్యానిఫెస్టోలు, హామీలు తయారు చేయడం వంటివి చేస్తుంటారు. గెలుపు దిశగా వెళ్తున్న పార్టీని ఆ విజయాన్ని మరింత చేరువ చేస్తారు. అయితే వీరికి జనం నాడి తెలుసు కాబట్టి పరిపాలనపై అవగాహన ఉంటుందా అంటే చెప్పలేం. అలా అని వీరు కేవలం వ్యూహాలకు పరిమితం అని మనం భావించకూడదు.


గతంలో 2004 ఎన్నికల అనంతరం సోనియాగాంధీ నేతృత్వంలో యూపీఏ-1 ప్రభుత్వంలో నేషనల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో దేశం గర్వించదగిన మేధావులు ఉన్నారు. వారెవరకీ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు. హస్తం పార్టీని విమర్శించిన నేతలకు  ఆ కమిటీలో చోటు దక్కింది. వాళ్లంతా అద్భుతమైన సలాహాలు ఇచ్చారు కాబట్టే ఉపాథి హామీ పథకం వచ్చింది. అలాగే సమాచార హక్కు, గృహ హింస, విద్యాహక్కు లాంటి గొప్ప గొప్ప చట్టాలు వచ్చాయి. ఫలితం 2009లో కూడా యూపీఏనే అధికారంలొకి వచ్చింది.


కానీ యూపీఏ-2లో ఈ కమిటీని పక్కకు పెట్టడంతో కుంభకోణాల పెరిగిపోయాయి. తర్వాత ఓటమి పాలైంది. అయితే వ్యూహకర్తలు సలహాలు, సూచనలు సీఎంలు, ప్రధాని పాటిస్తారా అనేది ప్రశ్నార్థకం. ఎన్నికల తర్వాత వ్యూహకర్తలు పౌర సమాజం పట్ల ప్రేమతో సలహాలు సూచనలు ఇస్తే ఆ పార్టీకి లాభం చేకూరుతుంది. కానీ ఇది ఎంతవరకు అమలు అవుతుందో చెప్పడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: