గతంలో ఏ పార్టీలో జరగనన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఫ్రెష్ లుక్ ఇవ్వటంతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్లో అసంతృప్తిని చల్లార్చటమే టార్గెట్ గా పెట్టుకున్నారు జగన్. ఇందులో భాగంగానే కొందరికి టికెట్లు నిరాకరిస్తు, మరికొందరికి నియోజకవర్గాలను మార్చుతున్నారు. ఎన్నికలన్నాక ప్రతిపార్టీలో ఒకటి రెండు నియోజకవర్గాల్లో మార్పులు చాలా సహజమే. కానీ జగన్ మాత్రం సుమారు 60 నియోజకవర్గాల్లో మార్పులు చేయబోతున్నారు.
ఇప్పటికి 38 నియోజకవర్గాల్లో మార్పులుచేసిన జగన్ సుమారు పదిమంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పేశారు. అలాగే మరికొందరు ఎంఎల్ఏలకు టికెట్ల నిరాకరణ, నియోజకవర్గాల మార్పులుండబోతున్నాయి. ఇదే సమయంలో ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీచేయించటం, ఎంఎల్ఏలకు ఎంపీ టికెట్లివ్వటం కూడా జగన్ సాహసమనే చెప్పాలి. ఈ మార్పులన్నింటికీ నియోజకవర్గాల్లో జగన్ చేయించుకుంటున్న సర్వేలు, ప్రజాభిప్రాయసేకరణ ఫీడ్ బ్యాకే కారణమని చెప్పాలి.
ఇవన్నీ జగన్ కోణంలో ఓకేనే మరి నేతలు, క్యాడర్ మాటేమిటి ? ఇక్కడే అసలు పాయింటుంది. అదేమిటంటే చాలా నియోజకవర్గాల్లో మార్పులపై ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్లో సంతోషం కనబడుతోంది. గిద్దలూరులో ఎంఎల్ఏ అన్నా రాంబాబంటే నేతలు, క్యాడర్లో బాగా వ్యతిరేకతుంది. రాంబాబును మార్చి కొత్తగా ఎవరిని పోటీచేయించినా ఓకే అని చాలాకాలంగా పార్టీలో చర్చజరుగుతోంది. ఇపుడు అన్నాను జగన్ మార్చేయటంతో నేతలు, క్యాడరంతా హ్యాపీగా ఉన్నారు. అలాగే విజయవాడ పశ్చమలో మాజీమంత్రి వెల్లంపల్లిని మార్చాలన్న నేతలు, క్యాడర్ కోరిక మేరకే మార్చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వద్దని మెజారిటి నేతలు, క్యాడర్ కోరుకున్నట్లుగానే పక్కనపెట్టేశారు.
ఎమ్మిగనూరులో కూడా చెన్నకేశవరెడ్డికి టికెట్ వద్దన్న మెజారిటి నేతల నిర్ణయాన్నే జగన్ అమలుచేశారు. ఈ విధంగా చూస్తే చాలా నియోజకవర్గాల్లో నేతలు, క్యాడర్ ఫుల్లు హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. నేతలు, క్యాడర్ను నిర్లక్ష్యంచేసి ఏకపక్షంగా వెళ్ళిన చాలా మంది ఎంఎల్ఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పెరుగుతోంది. ఎక్కడైనా జగన్ నిర్ణయంపై వ్యతిరేకత ఉంటే ఉండచ్చు. పార్టీలో మెజారిటి హ్యాపీగానే ఉన్నారు మరి జనాల స్పందన ఏమిటో చూడాలి.